ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని జి.శివడ పంచాయతీలో గల గిరి శిఖర గ్రామమైన కోటకొండ గ్రామశిఖరంలో మన్యం ప్రాంతానికి చివర రెండు కొండలు నడుమున వెలసిన దుర్గమ్మ ఉత్సవాలు దసరా సందర్భంగా ఘనంగా నిర్వహించారు. అటు భామిని మండలం నుంచి ఇటు కురుపాం మండలం గ్రామాల ప్రజలు ఆరాధ్యదైవంగా ఎన్నో ఏళ్లుగా దుర్గమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తారు. గిరిజనులు తమ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందుగా దుర్గమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఆది, బుధవారాల్లో వందలాది మంది భక్తులు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దసరా నవరాత్రులను పురష్కరించుకుని ఆది, బుధ, శుక్రవారాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిమంది ప్రజలు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులను చెల్లిస్తారు.పురాతన కాలం నుండి వెలిసిన దుర్గమ్మ తల్లి సుమారు వందేళ్ల క్రితం వెలసిన కోటకొండ దుర్గమ్మ గిరిజన గ్రామాల గిరి శిఖర ప్రాంతంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అప్పుడు ప్రజలు కొండల మధ్య నడుచుకుంటూ వెళ్లి పూజలు చేసేవారు. గిరి శిఖర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం ఉండేది కాదు. ఆ సమయంలో కొండల్లో వెలిసిన రెండు దుర్గమ్మ ఆకారంలో ఉన్నటువంటి రాతి విగ్రహాలను ఒక వ్యక్తి రెండు మొక్కలు చేసి పడేసినప్పటికీ అవి మళ్లీ కలిసి దుర్గమ్మ తల్లి ఆకారంలో ఉంటే వచ్చేవని, ఆ పని చేసిన వ్యక్తి అనారోగ్యం పాలయ్యే వాడని పురాతన ప్రజలు చెప్పుకొచ్చేవారు. దీంతో దుర్గమ్మ తల్లి వెలసిన గ్రామ పరిసర ప్రజలు ఎటువంటి కోర్కెలు కోరిన దుర్గమ్మ తల్లికి మొక్కుకున్న వారి కోర్కెలు పరిష్కారమయ్యావని, దీంతో భామిని, కురుపాం మండల గిరిజన గ్రామాల ప్రజలు దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ అంచలంచలుగా అభివృద్ధి చేస్తూ, ఇప్పుడు రహదారి సదుపాయం కలగడంతో దసరా నవరాత్రుల సమయంలో తండొప తండాలుగా భక్తులు వెళ్లి పూజలను ఘనంగా నిర్వహిస్తుంటారు.మండలంలో జి.శివడ పంచాయితీ కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్యన వెలిసిన దుర్గమ్మ తల్లి గుడికి కనీసం రహదారి సౌకర్యం లేనప్పటికీ కోటకొండ గ్రామానికి రహదారి వేసిన కాంట్రాక్టర్‌ను జి.శివడ గ్రామస్తులు గుడి కట్టించి రహదారి వేయాలని కోరగా ఆయన అందుకు అంగీకరించి గ్రామస్తులు సహకారంతో దుర్గమ్మ గుడి వరకు రహదారి మెట్లు వేయించి గుడిని నిర్మించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కలిసి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వాహనాలు గుడి వద్దకు వెళ్లేలా చేయడంతో ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి గుడి వద్దకు వందలాది వేలాది మంది భక్తులు మేళ తాళాలతో చేరుకుని పూజలను ఘనంగా నిర్వహిస్తుంటారు.
