పాడి రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నాం : కృష్ణా మిల్క్‌ యూనియన్‌

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : పాడి రైతుల అభ్యున్నతికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ నిరంతరం కృషి చేస్తుందని కృష్ణ మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. మండలంలోని నాగవరం, వడ్లమన్నాడు పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాల వద్ద ”పాడి రైతు సంక్షేమం మన మతం అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని అనంతరం మాట్లాడారు. యూనియన్‌ పాడి రైతులకు అందించే ధర వ్యత్యాసం, కళ్యాణమస్తు, క్షీరభధు, ప్రతిభా, ఆక్సిడెంట్‌ కేర్‌ ట్రస్ట్‌ పథకాల గురించి పాడి పశువులకు అందించే పశు బీమా, డీ వార్మింగ్‌ , పశు దాణా, కాల్షియం, మినరల్‌ మిక్సర్‌ వాడటం వలన కలిగే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేశారు. యూనియన్‌ వారు అందించే సెమెన్‌ విశాఖ ద్వారా పుట్టిన దూడలు మాత్రమే భవిష్యత్‌ లో ఎక్కువ పాల చార గలిగిన పశువులు గా రైతులకి అధిక లాభాలు ఆర్జించగలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలకవర్గ సభ్యులు వి బి కే వి.సుబ్బారావు, గుడ్లవల్లేరు పాల శీతల కేంద్రం మేనేజర్‌ తోట సత్యనారాయణ, నాగవరం, వడ్లమన్నాడు సంఘ అధ్యక్షులు మోదుగమూడి మంగారావు, తోట సుబ్రహ్మణ్యం, సూపర్‌ వైజర్‌ పెయ్యేటి బసవ రాజ కుమార్‌ , వేతన కార్యదర్శి మున్నా, కొండ సంఘ పాలక వర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

➡️