తాగునీటి సమస్య లేకుండా పటిష్ఠ చర్యలు

Apr 12,2025 13:33 #Krishna district

 అధికారులను ఆదేశించిన మంత్రి కొల్లు
ప్రజాశక్తి-గూడూరు : మచిలీపట్నం ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం గూడూరు మండలంలోని తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలనీ, ప్రస్తుతానికి నాలుగున్నర మీటర్ల వరకు ఉన్న నీటి నిల్వను అవసరమైతే గరిష్ట స్థాయి వరకు నిల్వ చేసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో 70 హెచ్.పి మోటార్లు మాత్రమే ఉండగా కొత్త మోటార్లు ఏర్పాటు చేసి నీటిని నింపడంతో పాటు అదే సమయంలో ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పంపుల చెరువులో కూడా నీటి నిల్వ 8 అడుగుల వరకు ఉందని, పూర్తి సామర్ధ్యం 13 అడుగులకు పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలనీ, అప్పుడే వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.అదే సమయంలో కరకటూరు నుండి బందరు వరకు పైపు లైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు. నందమూరి తారక రామారావు చొరవతో నాడు ఈ ట్యాంకును ఏర్పాటు చేశారని, దాన్ని కాపాడుకోవడంతో పాటుగా భవిష్యత్ అవసరాల మేరకు నూతన ట్యాంకు,ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కృష్ణా నది నుండి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుంటే తాగునీటికి ఇబ్బందులు లేకుండా పోతాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేలా అధికారులు కూడా చొరవ చూపాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల్ని ఆదేశించారు.

➡️