మురుగు కాలువ లలో పూడిక తీయించండి : ఏపీ కౌలు రైతు సంఘం

చల్లపల్లి :   జిల్లాలో మురుగు కాలువలలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన పూడిక తీయించాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మురుగు కాలువలను పూడిక తీయించకపోవడంతో.. వరదలు సంభవించినప్పుడు పంటలు మునిగిపోతున్నాయని అన్నారు. ఆరుగాలం పండించిన పంట నీటి పాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో అనేక మురుగు కాలువల్లో పూడిక తీయించి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుందని తెలిపారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు ఆందోళన చెందుతున్న సమయంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంటలు మురుగు నీటిలో మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం అకాల వర్షాలకు నారుమళ్ళు మునిగిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిచాన్‌ తుఫాన్‌ వల్ల చేతికి వచ్చిన పంట నీట మునిగి మొక్కలు రావటంతో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పట్టారన్నారు మురుగు కాలువల్లో యంత్రాలు ఉపయోగించి పూడిక తీయించాలని డిమాండ్‌ చేశారు. మురుగు కాలువలలో పూడిక పూడిక తీయించాలని స్పందనలో రైతులు అర్జీలు దాఖలు చేశారని తెలిపారు. ఇప్పటికే అధికారులకు పూడిక తీతపై ఆదేశాలు జారీ చేసినట్లయితే ఎన్నికల నిబంధనల అధికారుల నుండి అనుమతి తీసుకుని ఈ వేసవిలో మురుగు కాలువల్లో పూడిక తీయించి రైతులను ఆదుకోవాలని కోరారు.

➡️