వృధాగా పోతున్న నీరు

Jan 12,2025 13:50 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండలలోని శివారు గ్రామాలకు ప్రతిరోజు తాగు నీరు వెంటనే సరఫరా చేయాలని మొవ్వ మండల సిపిఎం పార్టీ కార్యదర్శి శీలం నారాయణరావు మరియు కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కూచిపూడిలో నారాయణరావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా మొవ్వ మండలం శివారు గ్రామాలు చినముత్తేవి, అవిరిపూడి, మంత్రిపాలెం, నిడుమోలు గ్రామాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐలూరు గ్రామంలో ఉన్న మంచినీటి ఎత్తి పోతల భారీ వాటర్ ట్యాంక్ నుండి మండలంలో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేస్తారని వివరించారు . ఈ నేపద్యంలో ఐలూరు నుండి నిడుమోలు వరకు ఉన్న పైపు లైను చిన ముత్తేవి మురుగు కాలువ వంతెన వద్ద పైపులైన్ లీకై మంచినీరు కాలువలోకి రోడ్ల పైన వృధా గా ప్రవహించటం వల్ల గత మూడు రోజులుగా గ్రామాలకు మంచినీరు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా పైపులకు మరమ్మత్తు చేయకపోవటం వల్ల ఈపరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్లనే నేడు గ్రామాలకు నీటి సరఫరా అందటం లేదని విచారం వ్యక్తం చేశారు. పైపులు అయినప్పుడల్లా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పాలకులు, అధికారులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. అధికారుల,పాలకుల నిర్లక్ష్యం వల్ల పండుగ రోజు సైతం తాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల నుంచి మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.. పండగ సందర్భంలో కూడా సకాలంలో మంచినీరు పైపుల ద్వారా రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని వివరించారు. . పూర్తిస్థాయిలో శాశ్వతంగా పైప్ లైన్లు లీక్ లేకుండా మరమ్మతులు చేపట్టి, ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటిని ప్రతిరోజు అందించాలని డిమాండ్ చేశారు.

➡️