తలపై కృష్ణమ్మ.. గొంతు తడవదేవమ్మ..!

Mar 14,2025 00:23

మాచర్ల పట్టణ శివారులో ట్యాంకర్ల వద్ద నీరు పట్టకుంటున్న మహిళలు
ప్రజాశక్తి – మాచర్ల :
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాగార్జున సాగర్‌ జలాశయం మాచర్ల నియోజకవర్గంలో ఉన్నా ఇక్కడ అనేక గ్రామాలు సాగు, తాగునీటికి అల్లాడుతు న్నాయి. ప్రాజెక్టు నుండి కృష్ణమ్మ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల ఎకరాల సాగుకు, వేల గ్రామాల తాగునీటి అవస రాలు తీరుస్తుంది. కానీ మాచర్ల ప్రాంత ప్రజలు మాత్రం పారుతున్న ఆ నీటిని చూస్తూ నిస్సహా యులవుతున్నారు. ప్రతి వేసవి లోనూ మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలు దప్పికతో అలమటిస్తుంటాయి. తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమస్య తీవ్రంగా వుండే ఆ రెండు మూడు నెలలుపాటు తాత్కాలిక సర్దుబాటు చర్యలతో సరిపెడుతున్నారే కానీ శాశ్వత పరిష్కారం చూపటం లేదు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి, రెంటచింతల, దుర్గి, వెల్దుర్తి, మాచర్ల మండలాలలోని పలు గ్రామాలు, మాచర్ల పట్టణం శివారు ప్రాంతాలు వేసవి కాలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. వేసవిలో నాగార్జున సాగర్‌ కుడి కాలువ నీరు నిలిచిపోవటం, చెరువులు ఎండి, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయకపోవటంతో నీటి కష్టాలు మొదలవుతాయి. 800 నుండి 1200 అడుగుల లోతున బోర్లు వేస్తే గానీ నీరు లభ్యం అవ్వదు. అదీ కూడా కొనిచోట్లే. దీనికి తోడు కరెంటు కోతలు, లోవోల్టెజ్‌ సమస్యలతో బోర్లు నడవక భూమిలోని నీరు పైకి రాక ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిచోట్ల తాగునీటి పైపులైన్లు సరిగా లేక, నీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులున్నా నిరూపయోగంగా మారాయి. పురపాలక, గ్రామీణ నీటి సరఫరా అధికారులు తాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా సరఫరా అయ్యే నీరు పట్టుకోవటానికి ప్రజలు యుద్ధాలు చేస్తూంటారు. మాచర్ల నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించి శాశ్వతంగా తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రతి ఎన్నికల సమయంలో నాయకులు వాగ్దానం చేస్తుంటారు. నీటి సమస్య పరిష్కరించకుంటే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామంటూ భీషన ప్రతిజ్ఞలు కూడా చేశారు. కానీ ఎప్పటి లాగే ప్రజలు తాగునీటి కష్టాలతో అల్లాడిపోతున్నారు.
కలగానే వరికెపూడిసెల పథకం..
సాగు, తాగు అందించే వరికెపూడిసెల ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత వాసుల దశాబ్ధాల కల. మాచర్ల ప్రాంతంలో నీటి కష్టాలు తీరాలంటే వరికెపూడిశెల, బుగ్గవాగు రిజర్వాయర్‌ వాటర్‌ స్కీం పథకాలు పూర్తవ్వాలి. అయితే దశాబ్ధాలుగా పథకాన్ని పూర్తిచేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ కారణంగా మాచర్ల ప్రాంతంలో వర్షాభావ పరిస్థిలు అధికంగా ఉంటాయని, అందువలన ఈప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వరికెపూడిశెల ఎత్తిపోతల పథకం అవసరమని కోస్లా కమిటి చెప్పింది. అయితే పథకానికి మాత్రం మోక్షం లభించలేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు కూడా చేశారు. ఇటివల కాలంలో కొంత కదలికలు వచ్చి, అటవీశాఖ అనుమతులు లభించాయి. అయితే మొదటి ఫేజ్‌ కింద రూ. 500 కోట్లతో చేపట్టే వరికెపూడిశెల ప్రాజెక్టు ఈ ఏడాది కూడా ముందుకు వెళ్లని పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.15 కోట్లే కేటాయించింది. ఈ పథకం పూర్తిఅయితే వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలలో సాగు, తాగునీరు ఇబ్బందులు తొలిగిపోతాయి.
బుగ్గవారు మంచినీటి పథకం పూర్తిఅయ్యేనా…
బుగ్గవాగు రిజర్వాయర్‌ త్రాగునీటి స్కీం 2005లో శంకుస్థాపన జరిగింది. మాచర్లకు 13.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌ నుండి పైపు లైన్ల ద్వారా మాచర్ల పట్టణానికి తాగునీటికి అందించి శాశ్వతంగా తాగునీరు సమస్యను పరిష్కరించాలని ఈ పథకాన్ని రూపొందించారు. ప్రాజెక్టు మొదలై కొంత పనులు జరిగి నిలిచిపోయింది. 2009లో సవరించిన అంచనాలతో తిరిగి ఇదే పథకానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా సూమారు కోటి రూపాయల వ్యయంతో స్థానిక పిడబ్యూడీ కాలనీలోని హైస్కూల్‌ మైదానంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మించారు. తరువాత పనులు నిలిచిపోయాయి. తిరిగి 2023లో రూ. 84.71 కోట్ల సవరించిన అంచనాలతో పథకం రూపరేఖలు మార్చి శిలా ఫలకం వేశారు. ఈ ప్రయత్నం కూడా శిలాఫలకంతోనే నిలిచిపోయింది.
జలజీవన్‌ పథకంతోనైనా పరిష్కారం లభించేనా..
జవజీవన్‌ పథకం ద్వారా పల్నాడు ప్రాంతంలోని ఇంటిఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పథకం కింద పల్నాడు ప్రాంతానికి రూ. 600 కోట్లు నిధులు కేటాయింపులు జరిగాయని త్వరలోనే పనులు మొదలుపెట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఐదు మండలాలకు చెందిన గ్రామాల్లో వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌ అధికారులు తెలుపుతున్నారు. నీటి ఎద్దడి తలెత్తిన గ్రామాల్లో పంచాయితీ నిధులతోనే బోర్లు మరింత లోతు తవ్వేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. బోర్లు పనిచేయని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. జవజీవన్‌ పథకం పూర్తియితే త్రాగునీటి కష్టాలు శాశ్వతరంగా తీరుతాయని అధికారులు అంటున్నారు.

బుగ్గవాగు మంచినీటి పథకంలో భాగంగా కోటి రూపాయల వ్యయంతో మాచర్ల పట్టణంలో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌

➡️