సమావేశంలో మాట్లాడుతున్న నేతాజి
ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మండలిలోని, బయటా నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వివిధ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సంఘాల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలపై మండలిలో ప్రస్తావించి, వాటి పరిష్కారికి కృషి చేసే అభ్యర్థి లక్ష్మణరావు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్లు, నిరుద్యోగ, కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్.లక్ష్మణరావు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలితోపాటు, స్థానిక సంస్థలైన జిఎంసి, జెడ్పీ ఇతర వేదికలలోనూ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, ఇళ్ల స్థలాలు, కౌలు రైతుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారన్నారు. నిరుద్యోగ సమస్యలు, స్కీమ్ వర్కర్స్ సమస్యలు, జిల్లా, రాష్ట్ర అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహనతో మాట్లాడతారన్నారు. రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసే అభ్యర్థి అని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు మాకు అవసరం లేదని, పేదలకు ఇవ్వండని తిరస్కరించిన ఆదర్శనీయులు పిడిఎఫ్ ప్రజాప్రతినిధులు అని కొనియాడారు. కెఎస్ లక్ష్మణరావు గెలుపు ప్రజల గెలుపని అన్నారు. ఈనెల 10వ తేదీన ఉదయం 10గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ, అనంతరం కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తారని, ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్.ఎ.చిష్టీ, ఐద్వా నాయకులు ఎ.కళ్యాణి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై.కృష్ణకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎమ్.కిరణ్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఎస్.పద్మ పాల్గొన్నారు.
