ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : మున్సిపల్ పాఠశాలల్లోని లాంగ్వేజ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన అమలు చేయకుండా కొందరు అధికారులు జాప్యం చేయడం పట్ల మండిపడుతున్నారు. సోమవారం ఆదోనిలోని మున్సిపల్ ఉపాధ్యాయులు విలేకరులతో మాట్లాడుతూ … గత సంవత్సరం అక్టోబర్ నెలలో మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రక్రియ సత్వరమే అమలుకు నోచుకోక జాప్యం జరిగిందన్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే నేటికీ మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాలేదనీ, మరీ ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని నంద్యాల, ఆదోని పురపాలక సంఘాల యూనిట్ గా పదోన్నతులు జరగాలని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. అత్యంత అనుభవం గల సుధీర్ఘ కాలం జిల్లా కార్యాలయంలోనే ఉన్న విద్యాశాఖ అధికారులు ఉన్నప్పటికీ ఎందుకో నేటికి ఖాళీల సంఖ్య ను కూడా బహిరంగంగా ప్రకటించడం లేదని ఆరోపించారు. కర్నూలు కార్పోరేషన్ లో పని చేసే ఉపాధ్యాయులకు లాంగ్వేజ్ పాఠశాల సహాయకుల పోస్టులకు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, నంద్యాల, ఆదోని పురపాలక సంఘాల యూనిట్ విషయంలో లేనిపోని సందేహాలు వ్యక్తం చేస్తూ ఎడతెగకుండా కొందరు అధికారులు సాగదీస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉండడంతో కొందరు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట గా కార్యాలయంలో నడుస్తోందని చెప్పారు. పదోన్నతి అర్హత గలవారు తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. నిర్లక్ష్యం వీడి ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియన వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ పరిధిలోకి వచ్చాక మున్సిపల్ ఉపాధ్యాయులను ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులుగా భావిస్తున్నట్లుందని ఆవేదన చెందారు. ఉపాధ్యాయులకు భారీ సంఖ్యలో పదోన్నతులు నిర్వహించిన విద్యా శాఖ అధికారులు తమ వంతు రాగానే చేతులెత్తేసిన విధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం …. పక్షపాతం లేకుండా వ్యవహరించాల్సిన అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా తగిన విధంగా స్పందించడం లేదని ఆశావహులు అంటుంటే… కొందరు మాత్రం అగైనెష్ట్ పోస్టులలో జీతం తీసుకుంటున్నారనీ, కొందరు మున్సిపల్ ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు కొందరు పరోక్షంగా వత్తాసు పలుకుతూ ఉన్నంత కాలం ఈ పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముగిసినప్పటికీ కర్నూలు జిల్లా లో ముగిసే ప్రసక్తి లేదేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొందరు మున్సిపల్ ఉపాధ్యాయులు భాషేతర పాఠశాల సహాయకుల పోస్టుల లో వుంటూ అగైనెష్ట్ పోష్టు కింద జీతం తీసుకొంటున్నందువల్ల ఆలస్యం కాగా నేడు లాంగ్వేజ్ పాఠశాల సహాయకుల పోస్టుల లో అగైనెష్ట్ గా జీతం తీసుకుంటున్న కొందరు మున్సిపల్ ఉపాధ్యాయుల వల్ల , విద్యాశాఖ లోని కొందరు అధికారులు వెన్నుదన్నుగావుండడం వల్లే పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి మున్సిపల్ విద్య వ్యవహారం పై కొంత సమయం కేటాయించి, జిల్లాలో మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
లాంగ్వేజ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలి : కర్నూలు ఉపాధ్యాయులు
