మాల లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సాయం

Apr 3,2024 13:31 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని రూరల్ : సొంత ఊళ్ళలో చేయడానికి పనులు లేక, ఉపాధి లభించక వందల వేలాదిమంది వేరే గ్రామాలకు నిత్యం వలసలు వెళుతున్నారు. అందులో భాగంగా ఆదోని మండలం చాగీ గ్రామానికి చెందిన మాల లక్ష్మి చిప్పగిరి మండలంలోని చిప్పగిరికి మిర్చి కోతల కోసం వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన ప్రమాదంలో మాల లక్ష్మీ అక్కడికక్కడే మరణించడం జరిగిందని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని కావున ప్రభుత్వం తక్షణమే మాల లక్ష్మి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, గాయపడిన వారికి చెరో లక్ష రూపాయలు సహాయం అందించాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మండల కార్యదర్శి డి. రామాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం చాగి గ్రామానికి వెళ్లి మరణించిన మాల లక్ష్మి కుటుంబాన్ని వారు పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సక్రమమైన వర్షాలు లేక, సాగు నీరు లేక, ఉపాధి లేక వేరే ప్రాంతాలకు వలస వెళుతున్న క్రమంలో ఇలా నిత్యం వ్యవసాయ కూలీలు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కావున తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించి సాగునీరు అందించాలని శాశ్వత వలసల నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కావున అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

➡️