ప్రజాశక్తి-ఆదోని : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 28 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు వీరేష్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా, పర్వతాపురం, మండగిరిలో దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీర యువకిశోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి లక్ష్మన్న, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు వీరేష్ మాట్లాడారు. 22 నుండి 28 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భాగంగా మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ ల 94వ వర్ధంతి నిర్వహించామన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ, పీడన, అణచివేత లేని సంపూర్ణ స్వతంత్రం కోసం, దేశ విముక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీరకిషోర భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లను 1931 మార్చి 23 న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష పేరుతో హత్య గావించింది. ఉరికొయ్యను ముద్దాడిన వీరకిషోర్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మోహన్, నాగరాజు, చంద్, జామిర్ మహేష్, మంజు తదితరులు పాల్గొన్నారు.
