రామోజీరావు మృతికి సంతాపం 

Jun 8,2024 15:45 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు అనారోగ్యంతో నేడు తుది శ్వాస విడిచారని, వారి అకాల మరణానికి సిపిఐ కర్నూలు జిల్లా సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు తెలుగు భాషాసంస్కృతికి, అభ్యున్నతికి ఈనాడు దినపత్రిక ద్వారా పెద్దపీట వేశారని గుర్తుచేశారు. సహజ పదకోశాలతో అన్యాయానికి గురవుతున్న అనేక మంది ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిస్కారానికి పత్రిక ద్వారా అవిరాళంగా కృషి చేశారని వారు అన్నారు. ముఖ్యంగా అన్నదాత అనే మాసపత్రిక తీసుకొని రావడం ద్వారా వ్యవసాయ రంగంలో అనేక మెలకువలు చూపి అక్షర నిరాజనం చేశారన్నారు. పత్రికా ద్వారానే కాకుండా దేశంలోనే అన్ని భాషలలో వార్తా సంస్థలను స్థాపించి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా తెలియజేశారన్నారు. దేశంలోనే అందమైన రామోజీ ఫిలిం సిటీని నిర్మించాడని ఈటీవీ ప్రసారమయ్యే పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా అనేకమంది గాయకులకు మంచి జీవితాన్ని అందించాడన్నారు.అలాంటి రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు, దేశానికి తీరని లోటు అని ఆయన అభిప్రాయపడ్డారు. కావున ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

➡️