కర్నూలు ఎపిజిబి రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఎపిజిబి) ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నగరంలోని భాగ్యనగర్ ఎపిజిబి రీజనల్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని తరలించొద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ.. బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. బ్యాంకులు విలీనమైన సందర్భంలో ఏది పెద్ద బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంగా కొనసాగించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌బిఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులు విలీనమైన సందర్భంలో ఏది పెద్ద బ్యాంకు అయితే ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయమే కొత్తగా ఏర్పడిన బ్యాంకు కార్యాలయంగా ఏర్పడాలని ఉందని, రెండవ గైడ్‌లైన్స్ ప్రకారం రాష్ట్ర రాజధానిలో పెట్టుకోవచ్చని ఉందని, మూడవ గైడ్‌లైన్స్ ప్రకారం సొంతభవనం ఏ బ్యాంకుకు ఉంటే ఆ బ్యాంకునే ప్రధాన కార్యాలయంగా కొనసాగించాలని ఉందన్నారు. మొదటిది, మూడో గైడ్‌లైన్స్ ప్రకారం ఎపిజిబి ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగే అర్హత ఉందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ప్రధాన కార్యాలయం వేరే ప్రాంతానికి వెళ్తే నష్టపోయేది రాయలసీమ వాసులేనని తెలిపారు. సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజరు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు రమణారెడ్డి, సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సాయిబాబా, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, న్యూసిటీ కార్యదర్శి ఓల్డ్ సిటీ కార్యదర్శి మెహమూద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుధాకర్రప్ప తదితరులు పాల్గొన్నారు.