రానున్న వేసవితో మరింత ఆందోళ
ప్రజాశక్తి – గోనెగండ్ల : గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. గత ప్రభుత్వ హయాంలో పనులు అరకొరగా జరిగాయి. అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పనులు చేపట్టి ఇంటింటికి ఉచిత కులాయి ద్వారా త్రాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం పనులు నత్త నడకలా సాగుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా త్రాగునీటి సమస్య జఠిలమైతున్నందున పాలకులు అధికారులు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కర్నూల్ జిల్లాలోని గోనెగండ్ల మేజర్ గ్రామపంచాయతీలో సుమారు 22,000 జనాభా ఉంది. ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు సుమారు రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. అందుకు సంబంధించి 19 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసేందుకు అవసరమైన పైపులు వచ్చి చేరాయి. ఈ నిధులతో గ్రామంలో 4 ఓ హెచ్ ఆర్ ట్యాంకులకు గాను ఒకటి పూర్తికాగా మరో మూడు ట్యాంకులు ఎస్ఎస్ ట్యాంకు వద్ద అదనంగా మరో ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే గ్రామంలో ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరుతాయి. గ్రామంలో ప్రస్తుతం నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుంది. ఈ పనులు పూర్తి అయితే ప్రతిరోజు కాకపోయినా కనీసం రోజు విడిచి రోజైనా నీటి సరఫరా జరుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
గాజులదిన్నె నీటి పథకం పూర్తయితే 16 గ్రామాలకు త్రాగునీరు
గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద 19.50కోట్ల జల జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన గాజులదిన్నె త్రాగునీటి పథకం పనులు పూర్తయితే మండలంలోని 16 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. గతంలో ఈ పథకం పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి చొరవతో ఇంటెక్ వెల్,ఫుట్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా రోజుకు 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రాపిడ్ శ్యాండ్ ఫిల్టర్ మరియు సంపు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు కూడా నిలిచిపోయాయి. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి గ్రామాలకు త్రాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే బివి హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేరాలంటే పనులను వేగవంతం చేయాలని ప్రజలుకోరుతున్నారు.
వీలైనంత త్వరగా పనులను పూర్తి : శ్రీనివాస రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ
మండలంలోని 28 గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీర్చేందుకు జలజీవన్ మిషన్ పథకం కింద 34 కోట్ల రూపాయలతో 32 పనులు మంజూరయ్యాయి. వాటిలో ఐదు పనులు పూర్తికాగా 17పనులు వాటర్ గ్రిడ్ పథకంలోకి కన్వర్ట్ అయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి ఇంటింటికి ఉచిత కులాయి పైప్ లైన్ పనులను ప్రారంభించనున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు త్రాగు నీటి సమస్యను తీర్చేందుకు తగిన చర్యలు చేపడతాం.