రోడ్డు వేయండి

Jun 10,2024 15:09 #Kurnool

జి సింగవరం బస్టాండ్ నుండి కేసీ కెనాల్ వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర డిమాండ్

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం  జి సింగవరం గ్రామం బస్టాండ్ నుండి కేసు కెనాల్ వరకు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా, మండల నాయకులు రాము, సురేష్, గ్రామ యువకులతో కలిసి R&B SEకి వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ కర్నూలు నుండి సుంకేసుల గ్రామానికి రోడ్డు వేసే సందర్భంలో రోడ్డుని తొలగించారని అన్నారు. సుంకేసుల రోడ్డు పూర్తి చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోడ్డు ఎందుకు వేయలేదని విచారించగా భద్రమైన సిమెంటు రోడ్డు వేయడం కోసం నిలిపివేశారని స్థానికులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఆ రోడ్డు వేసి రెండు సంవత్సరాలైనా ప్రభుత్వం మారిపోయిన నేటికీ జి సింగవరం బస్టాండ్ నుండి కేసు కెనాల్ వరకు వేయాల్సిన రోడ్డును వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోడ్డులో ప్రయాణం చేసేవారు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మోటార్ సైకిల్ లో ప్రయాణం చేసేవారు ఆ గుంతల్లో నిలిచిపోయిన మురికినీటిలో పడి గాయాల పాలవుతున్నారని తెలియచేశారు. ఆటోలు బస్సులు తిరగడానికి కూడా అసౌకర్యంగా ఉందన్నారు. ఆ రోడ్డు కారణంగా ఆర్కే దుద్యాల ఎదురూరు ఆర్ కొంతలపాడు సుంకేసుల కొత్తకోట గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వెంటనే తమరు కలుగజేసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని మనవి చేశారు. ఎస్సీ స్పందించి వెంటనే ఉపశమనం కోసం తాత్కాలిక పనులు చేపడతామని తరువాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందించిన వారిలో గ్రామ యువకులు ప్రశాంత్, దివాకర్, శశి పాల్గొన్నారు.

➡️