ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గోపాల్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర పిలుపునిచ్చారు. నవంబర్ 26న జరిగే ర్యాలీలను సభలను జయప్రదం చేయాలని దేవమాడ దొడ్డిపాడు పూలతోట ఇందిరమ్మ కాలనీ గొందిపర్ల ఈ తాండ్రపాడు పంచలింగాల గ్రామాలలో కరపత్రాల పంపిణీ చేశారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి మూడవసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత కూడా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా ఉందని అన్నారు. సంపద సృష్టించే కార్మికులు దేశానికి తిండి పెట్టే రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేశారు. కానీ దేశంలో బిజెపి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని అన్నారు. బిజెపి గత పది ఏళ్లలో కార్పొరేట్లకు 19.28 లక్షల కోట్లు రుణమాఫీ,పన్ను రాయితీ ప్రోత్సాహాల పేరుతో ప్రజాధరాన్ని దోచిపెట్టిందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా భారీ పరిశ్రమలు గనులు సముద్ర తీరాన్ని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చారన్నరు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. రైతుల కు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని తెలియజేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే కార్యక్రమాల్లో రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, మునిస్వామి, మద్దిలేటి గ్రామ రైతులు పాల్గొన్నారు.
