- ఎపి రైతు సంఘం వినతి
ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ : కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ వద్ద తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి, బ్యారేజీ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టే నిర్మాణంలో కర్నూలు జిల్లాకు ఉపయోగపడేలా మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ పరిపాలన అధికారి జయశ్రీని శనివారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి, జి.రామకృష్ణ మాట్లాడుతూ…కర్నూలు జిల్లాలో అత్యధిక భాగం ఇప్పటికీ వర్షాధారితమైన పంటలు పండుతున్నాయని, నీటి ప్రాజెక్టులు లేకపోవడం వలన సరైన పంటలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రతి మూడేళ్లకొకసారి జిల్లా మొత్తం కరువుకు గురవుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్రిడ్జి, బ్యారేజీపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులను కూడగట్టి పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా రైతులకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.