ఏపి అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ఆవాజ్ రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : వక్ఫ్ చట్ట సవరణ ను రద్దు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందని అదే తరహాలో మన ఏపీ కూటమి ప్రభుత్వం కూడా వక్ఫ్ చట్ట సవరణ రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఏ.సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఇక్బాల్ హుస్సేన్ , ఎస్.ఎం.డి.షరీఫ్ లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేశారు. ఆదివారం సుర్జిత్ భవన్లో నాసిర్ అధ్యక్షతన ఆవాస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాలన్ మాట్లాడుతూ ఎన్డీఏ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో పనిచేస్తుందని, అందులో భాగంగానే దళితులపైన మైనార్టీలపైన లేనిపోనిఅబద్ధాలను ప్రచారం చేస్తూ, వారి హక్కులను, రాజ్యాంగం కల్పించిన అనేక రకాల చట్టాలను కాలరాస్తుందని, రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పాలకులు పాలిస్తున్నారని వారు దుయ్యబట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేడు రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసం ఆదానీ, అంబానీ లాంటి బడా వ్యాపార సంస్థల అధినేతలను కాపాడుకోవడం కోసం బీజేపీ పని చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చట్ట సవరణను తీసుకొని వస్తుందని దీన్ని ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్సిపి జగన్ ఎంపీలు పార్లమెంట్లో వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే బీహార్ జెడియు నితీష్ కుమార్ మద్దతు ఇవ్వకూడదని వారు విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనార్టీలపైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చట్ట సవరణకు గట్టిగా తమ గొంతు వినిపించి రద్దు అయ్యే వరకు పోరాడాలని వారు కోరారు. లేనిపక్షంలో ముస్లింలు, ప్రజా సంఘాలతో పాటు ఇతర సెక్యులర్ సంస్థలను ప్రజానీకానికి సమీకరించుకొని ఈ టిడిపి కూటమి ప్రభుత్వానికి, జగన్ కి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ పోరాటాలకు ప్రజానీకం కూడా మద్ధతివ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో అబ్దుల్, నాసిర్అహ్మద్, ఇలియాస్, అబ్దుల్ నయీమ్, చాంద్ భాషా, శాలి భాష, తదితరులు పాల్గొన్నారు.