ప్రజాశక్తి- గాజువాక :వివక్షత లేని సమాజం కోసం కెవిపిఎస్ అనేక పోరాటాలు చేసిందని, తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్‌లో కెవిపిఎస్ ముద్రించిన 2025 కేలండర్‌ను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితులపై దాడులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బీవీ రాఘవులు ఆధ్వర్యంలో కెవిపిఎస్ ప్రత్యక్ష పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. వివక్షతపై ప్రజల్లో చైతన్యానికి సైకిల్ యాత్ర, ఇతర అవగాహన కార్యక్రమాలను కెవిపిఎస్ నిర్వహించిందన్నారు. నేటికీ దళితులపై దాడులు విచారకరమన్నారు. ఇటీవల ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాను దేవాలయాలకు రాకుండా బయట ఉంచిన విధానం ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో నేటికీ దళితులపై హింస, హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పైనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. బిజెపి ప్రభుత్వం అనేక రాజ్యాంగం సవరణలు చేస్తోదందని, అందులో భాగంగా ఎన్నికల సంఘం, ఎన్నికలల్లో చేపడుతున్న సవరణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఎలక్షన్ కమిషన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకుండా తొలగించారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం పట్టించుకోలే దన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎ.తవిటయ్య, దయాసాగర్, రామారావు, మత్స్యరాజు, విష్ణు ప్రసాద్, దయాసాగర్, కెవిపిఎస్ నాయకులు వైటిదాస్, ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు.
కేలండర్ ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు