రేపటి నుండి ఒంటిపూట పాఠశాలల నిర్వహణ : జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎల్‌. చంద్రకళ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలలు అన్‌ ఎయిడెడ్‌, మేనేజ్మెంట్‌ పాఠశాలలు రేపటి నుండి (15వ తేదీ నుండి) ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు (వచ్చే నెల 23 వరకు) 1 నుండి 9 తరగతులకు ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ”ఒంటి పూట బడులు” నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎల్‌. చంద్రకళ సూచించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 10 వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల విద్యా క్యాలెండర్‌ ప్రకారం ఒంటి పూట బడుల నిర్వహణకు సమయ పాలన సూచనలను పాటించాలన్నారు. వచ్చే నెల 2వ శనివారం పాఠశాల నిర్వహించాలని గ్రామ పంచాయతీ, ఆర్‌ డబ్ల్యుఎస్‌ శాఖల సహకారంతో తాగునీరు అందించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో / చెట్ల కింద తరగతులు నిర్వహించరాదన్నారు. విద్యార్థులు వడదెబ్బకు గురైతే, వైద్య – ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రతి పాఠశాలలో ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పాఠశాల సమయం ముగిసే సమయానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని స్వచ్చంద సంస్థల సమన్వయంతో మధ్యాహ్న భోజనంలో మజ్జిగ ఏర్పాటుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తనిఖీ అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.”ఒంటి పూట పాఠశాలల నిర్వహణ సక్రమంగా నిర్వహించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️