26న కార్మిక-కర్షక ప్రదర్శనలు

Jan 22,2025 00:22

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ :
దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు 26న జరిగే కార్మిక-కర్షక ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని మేక అమరారెడ్డి భవన్‌లో ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని, రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. దీనిపై పంజాబ్‌ రైతునేత జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ 57 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విధాన ముసాయిదాను వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుసంఘం మండల కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, రుణమాఫీ అమలు చేయాలని, నూతన మార్కెటింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని, 60 ఏళ్లు దాటిన కార్మిక, కర్షకులకు రూ.10 వేల పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటల బీమా ప్రభుత్వమే చెల్లించాలని, విద్యుత్‌ సంస్కరణ బిల్లు రద్దు చేయాలని కోరారు. సిఐటియు పట్టణ నాయకులు బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. ఎఐటియుసి నాయకులు కె.కాశయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని, మనువాద సిద్ధాంతాన్ని అమలుకు పూనుకుందని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా సాకే కార్మిక-కర్షక ప్రదర్శనలో అన్ని రంగాల ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు డి.వెంకటరెడ్డి, పి.కృష్ణ, బి.కోటిరెడ్డి, ఇ.రామారావు, గాంధీ, భక్కిరెడ్డి, కె.కరుణాకరరావు, బి.దశరథరెడ్డి, డి.విజయభాస్కరరెడ్డి, బి.గోపాలరావు, పి.లక్ష్మీనారాయణ, శామ్యూల్‌, టి.వెంకటయ్య, శ్రీరామ్‌, శ్రీను, దుర్గారావు, శాస్త్రి పాల్గొన్నారు.

➡️