గుంటూరులో ర్యాలీ
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలు మానుకోవాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల దేశ వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి మార్కెట్ సెంటర్ వరకూ వివిధ సంఘల నాయకులు, కార్మికులు, రైతులు వందల మంది జెండాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్ మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ సెంటర్‌లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్, ఎపి రైతు సంఘం నాయకులు పచ్చల శివాజీ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభ ప్రారంభంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు, హాజరైన వారితో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయ కార్యనిర్వాహక అధికారికి వినతిపత్రం అందజేశారు. గుంటూరులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల చారిత్రాత్మక పోరాటం వల్ల కేంద్రం దిగి వచ్చి వ్యవసాయ చట్టాలు రద్దు చేసిందన్నారు. ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీల అమలను విస్మరించిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్‌లు తెచ్చిందన్నారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలపై రైతులతో చర్చింకుండా చేయబోమని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే మద్దతు ధరల చట్టం తేవాలని, కేరళ తరహాలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు శాశ్వత రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. రాజ్యాంగం పట్ల, కార్మికులు, రైతులు పట్ల చిత్తశుద్ది, గౌరవం లేని పాలకులు దేశాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. పాలకుల విధానాల ఫలితంగా ఇప్పటి దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇటీవల వ్యవసాయ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆవేదన వెలిబుచ్చారు. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ఇంత వరకూ అమలు చేయలేదన్నారు. మరోవైపు లేబర్ కోడ్‌లు తెచ్చి, పారిశ్రామిక రంగంలో కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. రైల్వేలు, బాంకులు, ఎల్‌ఐసి,పోర్టులు, విమానయానం దేశ సంపద మొత్తం అంబానీ, అదానికి దోచి పెడుతున్నారని విమర్శించారు. రూ.1700 కోట్లు లంచం ఇచ్చి చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి, ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకులు వి.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజ్యాంగాన్ని కాలరాస్తూ కార్మిక, కర్షక హక్కులను తుంగలో తొక్కి నియంతృత్వంగా పాలిస్తుందన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ, కార్మికులకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయట్లేదన్నారు. రాబోయే కాలంలో కార్మికులు, రైతులు మోడీ ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. నరసరావుపేటలో నిర్వహించిన సభకు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి యు.రాము అధ్యక్షత వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు ప్రభుత్వాలను శాసించే స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాల్సిన అవసరముందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇంకా ఇవ్వకపోవడం మోసం చేయడమేనన్నారు. పల్నాడు జిల్లాను సస్యశ్యామలం చేసే వరికపూడిశెల ప్రాజెక్టు దశాబ్దాల కలగా మిగిలిందని, ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే కష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, నాగార్జున సాగర్ కుడికాల్వకు మరమ్మతులు చేసి చివరి భూములకు నిరందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు సభలో వివిధ సంఘాల నాయకులు యు.నాగేశ్వరరావు, పి.కోటేశ్వరారవు, వై.నేతాజి, ఎం.హనుమంతరావు, జె.శివశంకర్, బి.శ్రీనివాసరావు, ఇ.అప్పారావు, కోటయ్య, అవాజ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, అంగన్‌వాడీ, ప్రజానాట్యమండలి, మెడికల్ రిప్స్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట సభలో కె.హనుమంతరెడ్డి, గుంటూరు విజయకుమార్, ఎస్.ఆంజనేయులు నాయక్, ఏపూరి గోపాలరావు, జి.బాలకృష్ణ, కె.రామారావు, జి.మల్లీశ్వరి, డి.శివకుమారి, జి.రవిబాబు, వై.రాధాకృష్ణ, సిలార్ మసూద్, ఎ.మారుతి వరప్రసాద్, కె.రాంబాబు, వి.వెంకట్, రెడ్ బాష, టి.ఆంజనేయులు, ఎన్.రాంబాబు, పి.శ్రీను, ఎన్.రామారావు, ఎన్.కృష్ణ పాల్గొన్నారు.
నరసరావుపేటలో ర్యాలీ