ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్‌లను రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్ అన్నారు. మంగళవారం సంయుక్త కిసాన్‌మోర్ఛా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుమారు 120 మంది కార్మికులు మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్, జిల్లా కౌలు రైతుసంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కొండమూరి హజరత్తయ్య, ఆత్మకూరు నాగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్త కార్యాచరణలో భాగంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలిపివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కౌలు రైతులకు చట్టం చేయాలని, స్మార్ట్ మీటర్ల ప్రక్రియను నిలిపివేయాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు స్ఫూర్తితో రైతులు తమ పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. ఢిల్లీలో చలి, ఎండ తీవ్రతను లెక్కచేయకుండా ధర్నా చేశారన్నారు. ఎంతోమంది ప్రాణాలర్పించి ఈ వ్యవసాయ కార్మిక వ్యతిరేక పోరాటం చేస్తే, ప్రధానమంత్రి దిగొచ్చి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారని తెలిపారు. ఈ వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకుంటామని చెప్పి ప్రకటించారన్నారు. కానీ దొడ్డిదారిలో ఈ చట్టాలను అమలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ అన్ని పంటలకు కనీసం మద్దతు ధరను చట్టం చేయలేదని, స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తానని చెప్పిన, ప్రధాని ఆ సిఫార్సును తుంగలో తొక్కి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేతులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. అదేవిధంగా గతంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి అనేక చట్టాలను తెచ్చుకున్న 29 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్‌లుగా ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఎవరూ లేని సందర్భంలో చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి షేక్ అన్వర్, బి.రత్నయ్య, ఎం.ఓంకార్, సిఐటియు మండల నాయకులు డేవిడ్ రాజు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పి.రాధమ్మ, ఎల్‌ఐసి యూనియన్ నాయకులు జాన్ ప్రభాకర్, ఎస్‌డబ్ల్యుఎఫ్ జిల్లా నాయకులు ఎస్.కె.మహమ్మద్ అలీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురవయ్య, ఆశావర్కర్ల యూనియన్ కార్యదర్శి బి.రమణమ్మ, హెల్త్ యూనియన్ నాయకులు పి.జిలాని, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు, ఎస్.కె గుల్జార్ బేగం, తదితరులు పాల్గొన్నారు.