25, 26 తేదీల్లో కార్మిక, కర్షక నిరసనలు

Jan 22,2025 23:16

విలేకర్లతో మాట్లాడుతున్న రైతు, కార్మిక సంఘాల నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
జాతీయ రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు జగ్జీత్‌ దల్లేవాల్‌కు మద్దతుగా, రైతు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం గుంటూరులో, శనివారం మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్నట్లు రైతుసంఘాల నాయకులు తెలిపారు. బుధవారం బ్రాడీపేటలోని రైతుసంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కంజుల విఠల్‌రెడ్డి, ఏరువాక రైతు సంఘం నాయకులు రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, నాయకులు ముత్యాలరావు మాట్లాడారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ జరిగే నిరసనల్లో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

➡️