ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే లక్ష్మణరావును గెలిపించాలి

Jan 12,2025 00:06

సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ కాసిం అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, రైతు, కార్మిక, కర్షకుల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి కెఎస్‌.లక్ష్మణరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సంఘాలన్నీ ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ శాసనమండలిలో ఇప్పటివరకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు ఈ 18 ఏళ్లలో ఒక్క అవినీతికి కూడా పాల్పడకుండా నిజాయితీగా పనిచేశారని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగం విలువలకు కట్టుబడి శాసనమండలలో మాట్లాడుతున్నారని, పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేసే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ కెఎస్‌లక్ష్మణరావు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినప్పుడు వారికి అండగా ఉండి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషిచేశారని, ఎక్కువ విస్తీర్ణాన్ని సాగు చేస్తున్న కౌలురైతులకు అండగా ఉండి వారికి పంటరుణాల కోసం అనేక వేదికపై మాట్లాడారని గుర్తు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కె.సాయికుమార్‌, సిఐటియు పిడుగురాళ్ల మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ లక్ష్మణరావు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యార్థి, అంగన్వాడి, ఆశ, ఎఎన్‌ఎం, విఆర్‌ఎ, తదితర చిరుద్యోగుల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంపై పోరాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు షేక్‌ జమాల్‌, మండల అధ్యక్షులు గోస్‌ ప్రసాద్‌, కొత్త రామకృష్ణ, సాయిబాబు, ప్రశాంత రాజు, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు రోహిత్‌, నాయకులు యాసిన్‌, అజరు, అంగన్వాడి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️