ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా భూముల రీ సర్వే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేశారు. మంగళగిరి, తాడేపల్లి మండలాలు కార్పొరేషన్‌లో కలవడం వల్ల సర్వేనుంచి ఈ మండలాలను మినహాయించారు. గత ప్రభుత్వ హయాంలోనే వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయింది. దీంతో ఈ మండలాలను కూడా ఎంపిక చేయలేదు. 14 మండలాల్లో 14 గ్రామాలను ఎంపిక చేశారు. రోజుకు 20 ఎకరాలే రెవెన్యూ సిబ్బంది రీ సర్వే నిర్వహిస్తారు. మండలంలో ఒకగ్రామాన్ని సర్వేకు ఎంపిక చేశామని సర్వే శాఖ అసిస్టెంట్ డైరక్టరు ఎ.పవన్ కుమార్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. లచ్చన్నగుడిపూడి (తాడికొండ మండలం), మందపాడు (మేడికొండూరు), వడ్డమాను (తుళ్లూరు), జడవల్లి (పొన్నూరు), పెరికలపూడి (దుగ్గిరాల), మంచాల (చేబ్రోలు), కాండ్రుపాడు (కాకుమాను), మెరికపూడి (ఫిరంగిపురం), మల్లాయపాలెం (ప్రత్తిపాడు), అనమర్లపూడి (పెదకాకాని), చినపలకలూరు (గుంటూరు పశ్చిమ), పెదరావూరు (తెనాలి), జొన్నలగడ్డ (గుంటూరు తూర్పు), కుంచవరం (కొల్లిపర) ఉన్నాయి. ఒక్కొ గ్రామంలో 200 నుంచి 250 ఎకరాలను తొలుత సర్వే చేయాలని నిర్ణయించామని పవన కుమార్ తెలిపారు. రోజుకు కేవలం 20 ఎకరాలను మాత్రమే సర్వే చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వేలో తొలి విడతగా ప్రభుత్వ భూములు, చెరువు, పోరంబోకు భూములు, అసైన్డు వివరాలను కూడా నమోదు చేస్తారు. ప్రధానంగా గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ, చెరువు, కుంటలు, పోరంబోకు భూములు వివరాలను ఇప్పటికే ఎంపిక చేశారు. అంతేగాక ఇప్పటికే 14 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఏ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి? ప్రభుత్వం ఎవరికి పంపిణీ చేసింది? ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రెవెన్యూ అధికారులు తొలుత ఈ సమాచారం నమోదు చేసిన తరువాత సర్వేకు సంబంధించి రైతులకు సమాచారం ఇస్తారు. జిల్లాలో మొత్తం 173 గ్రామాలు ఉండగా గత ప్రభుత్వ హయంలో 62 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 64 గ్రామాల్లో అనేక సమస్యలొచ్చాయి. గతంలో గ్రామసభలు నిర్వహించి సర్వే వివరాలను రైతులకు వివరించి వారితో లిఖితపూర్వకంగా వివరాలు తీసుకుని నమోదు చేశారు. అప్పట్లో అనేక వివాదాలు రావడంతో ప్రస్తుతం సర్వేలో వివాదాల పరిష్కారం దిశగా నిర్వహించాలని నిర్ణయించారు. ఒకేసారి గ్రామం మొత్తం సర్వే చేయకుండా దశల వారీగా రోజుకు గరిష్టంగా 20 ఎకరాలను మాత్రమే ఎంపిక చేశారు. దాదాపు 160 రోజుల పాటు సర్వే చేసేందుకు ప్రభుత్వం అధికారులకు గడువు ఇచ్చింది. సర్వే ప్రారంభంకు ముందే స్థానిక రైతులకు పూర్తి సమాచారం ఇవ్వడం, దండోరా, టాంటాం ద్వారా ముందస్తుగా తెలియజేయడం, వారి వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వ రికార్డులో ఉన్న వివరాలను సరిచూసుకుని హక్కుపత్రాలను నిర్ధారిస్తారు. వివాదాలు వస్తే మొబైల్ మేజిస్ట్రేట్‌తో పాటు వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులకు కూడా భూ యజమానులు ఫిర్యాదు చేయవచ్చు. సర్వేకు సంబంధించి ఒక్కొ బృందంలో ఇద్దరు విలేజ్ సర్వేయర్లు, విలేజ్ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ), గ్రామ రెవెన్యూ సహాయకుడు (విఆర్‌ఎ) ఉంటారు. ఇదేవిధానంతో నాలుగు బృందాలను నియమిస్తారు. ఒక బృందం భూ యజమానులకు, ప్రభుత్వానికి మధ్య సమాచారం అందిస్తారు. సర్వే బృందాలు ఆయా భూ యజమానులకు ముందుగా నోటీసు ఇవ్వడం, భూ యజమానితో పాటు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడం, గ్రామంలో ఉన్న రైతులందరికి కలిపి వాట్సాప్ గ్రూపు రూపొందించడం, తహశీల్దార్, సర్వేయర్లు గ్రామాన్ని సందర్శించి గ్రామాన్ని 200 నుంచి 250 ఎకరాలను బ్లాక్‌లుగా విభజించి ప్రతి గ్రామానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
