ప్రజాశక్తి – సాలూరు : రాష్ట్రంలో ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఎయిర్ బస్సు డ్రైవర్లకు కార్మికశాఖ ఇస్తున్న సర్కులర్లు ప్రకారం జీతాలు చెల్లించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్, సెలవులు వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఎపిఎస్‌ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి వి.తులసీరాం, జిల్లా నాయకులు వి.చంద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం స్థానిక ఆర్‌టిసి డిపో వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీలో కార్మిక చట్టాలు అమలు చేసి సర్క్యులర్ ప్రకారం స్కిల్డ్ వర్కర్లకు రూ.11900, సెమీ స్కిల్డ్, వర్కర్లకు రూ.14058, డ్రైవర్లకు రూ.17266, ఇఎస్‌ఐ, పిఎఫ్, వారాంతపు సెలవులు, లేబర్ హాలిడేస్ తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఈనెల 7న లేబర్ ఆఫీస్‌లో జరిగిన జాయింట్ మీటింగ్‌లో చర్చలు జరిగాయని, చట్టప్రకారం కార్మికులందరికీ ఆర్టీసీలో జీవోలను అమలు చేయడం లేదని తెలిపారు. మళ్లీ డిసెంబర్ 4న విశాఖలో గల లేబర్ ఆఫీస్‌లో జరుగు సమావేశానికి అన్ని డిపోల నుంచి కార్మికుల పెద్ద ఎత్తున తరలిరావాలని, డిమాండ్ సాధించుకునే వరకు ఐక్యంగా పోరాడేందుకు సిద్ధపడాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ థర్డ్ పార్టీ పేరుతో ఆర్టీసీ లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు సహకరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాడేందుకు వెనుకాడమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మిక సంఘం నాయకులు శంకర్, వి.సీతారాం, వి.ప్రభు, ఎల్.రమేష్, బి.సురేష్, సభాష్టియన్, జి.కుమార్, తేజ, ఖాన్, పోలారావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.