శిథిలావస్థలో లెదర్‌ పార్కులు

Apr 14,2025 00:50

అడిగొప్పల వద్ద మూతబడిన మిని లెదర్‌పార్కు
ప్రజాశక్తి – మాచర్ల :
కాలంతో పాటు పోటీపడలేక, నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక చర్మకారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నవారు మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో సుమారు 10 వేల మంది ఉంటారని అంచనా. వీరి జీవితాలను ‘మలుపు’ తిప్పాలని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని రెండు దశాబ్ధాల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మలుపు కేంద్రాలు (లెదర్‌ పార్కు శిక్షణ కేంద్రాలు) మూతబడ్డాయి. శిక్షణ పొందిన వందలాది మందికి ఉపాధీ దక్కలేదు. ప్రస్తుతం లెదర్‌ పరిశ్రమలు పెట్టడానికి కొరియా దేశానికి చెందిన ఒక బృందం ఈ ప్రాంతంలో పర్యటించటంతో ఈ సారైనా తమ జీవితాలు మలుపు తిరుగుతాయేమోనని చర్మకారులు ఎదురుచూస్తున్నారు.
శిథిలస్థితిలో మాచర్ల, అడిగొప్పల మినీ లెదర్‌ పార్కులు :
మాచర్ల పట్టణంలో మలుపు శిక్షణ కేంద్రం, 30 ఎకరాల్లో దుర్గి మండలం అడిగొప్పల గ్రామ సమీపాన మినీలెదర్‌ పార్కు నిర్మాణానికి రూ.కోటిని సిఎం చంద్రబాబు 2003లో మంజూరు చేయగా అప్పటి మంత్రి కోడెల శివప్రసాద్‌ శంఖస్థాపనతో పనులు మొదలయ్యాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వాటి నిర్మాణాలను పూర్తిచేసి ప్రారంభించారు. చెప్పులు, బూట్లు తయారీకోసం రూ.25 లక్షలతో ఆధునాతన యంత్రసామగ్రిని తెప్పించి యువతకు శిక్షణ తరగతులను మొదలు పెట్టారు. కొందరికి మద్రాస్‌లో శిక్షణ ఇప్పించి ఇక్కడ మాస్టర్‌ ట్రైనర్లుగా ఉద్యోగాలు కల్పించి శిక్షణిప్పించారు. మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, గురజాల, దాచేపల్లి, బొల్లాపల్లి, ఈవూరు మండలాలలకు చెందిన మూడువందల మంది వరకు శిక్షణ పొందారు. శిక్షణ పొందిన యువతకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు చేసేవారు. తయారు చేసిన చెప్పులు, బూట్లు వారే మార్కెట్లో అమ్ముకునే సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో ఆరు నెలలకే మినీ లెదర్‌పార్కులను పాలకులు మూసేశారు. అందులోని ఖరీదైన యంత్ర సామగ్రి తరలిపోయింది. ఉన్న పరికాలు తుప్పుపట్టాయి. ప్రస్తుతం ముళ్ల పొదల మధ్య శిథిల స్థితిలో ఉన్నాయి. భూములు అన్యాక్రాంతం అయ్యాయి. 21 ఏళ్ళగా మలుపు కేంద్రాలు తెరుచుకోకపోవటంతో యువతకు ఉపాధి లేకుండా పోయింది. ఎప్పటి లాగానే చర్మకారులు రోడ్ల వెంబటి చెప్పులు కుట్టుకుంటూ అస్తుబిస్తుగా బతుకులీడుస్తున్నారు.
కొరియా బృందం పర్యటన :
లెదర్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం కొరియా దేశానికి చెందిన బృందం మాచర్ల మండలంలో ఇటివల పర్యటించింది. రాయవరం గ్రామంలో సర్వే నంబర్‌ 795/3 లోని 151 ఎకరాలు, కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 67/5లోని 450 ఎకరాల భూములను పరిశీలించారు. రేబాక్‌, పూమా, నైక్‌ వంటి ప్రపంచ దిగ్గజ పరిశ్రమల ఏర్పాటుకు ఈ స్థల పరిశీలన జరిగింది. త్వరలో కొరియా దేశస్తులు మాచర్ల మండలంలో లెదర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని వార్తలు రావటంతో ఈ ప్రాంతంలోని చర్మకారులు తమ జీవితాల్లో మార్పు వస్తుందని, మెరుగైన జీవన పరిస్థితులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
మూత పడ్డ మలుపు కేంద్రాలను తెరవాలి :
మూత పడ్డ మలుపు కేంద్రాలను వెంటనే తెరవాలని చర్మకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లెదర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసే నాటికి మలుపు కేంద్రాల ద్వారా యువతకు చెప్పులు, బూట్లు తయారీలో శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలని కోరుతున్నారు. శిక్షణ పొందిన వర్కర్లు సిద్ధంగా ఉంటే వెంటనే లెదర్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవనాలకు మరమ్మతులు చేసి, ఆధునిక యంత్రాలపై శిక్షణను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. ఒకవేళ పరిశ్రమలు ఇక్కడికి రాకపోయినా శిక్షణ పొందిన వారు వేరే ప్రాంతాల్లోనైనా ఉద్యోగాలు పొందటానికి అవకాశముంటుందని చెబుతున్నారు. వారం క్రితం రాష్ట్ర లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు అడిగొప్పుల మలుపు కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ పరిస్థితులు చూసి వెళ్లారు. వీటిని తిరిగి ప్రారంభించటానికి సాధ్యసాధ్యాలను పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
యువతకు శిక్షణ ఇవ్వాలి
రాయపాటి యోహాను, మాస్టర్‌ ట్రైనర్‌, మాచర్ల
రాష్ట్ర ప్రభుత్వం లిడ్‌క్యాపు ద్వారా 20 ఏళ్ల కిందట మద్రాసు సిఎల్‌ఆర్‌ఐ (సెంట్రరల్‌ లెదర్‌ రీసెర్చి ఇన్‌ట్యూట్‌)లో నాతోపాటు మాచర్ల చుట్టుపక్కల ఊర్లకు చెందిన 30 మందికి చెప్పులు, బూట్లు, లెదర్‌తో తయారు చేసే వస్తువులపై 45 రోజులుపాటు శిక్షణిప్పించింది. శిక్షణ పూర్తిచేసి తిరుగొచ్చిన మేము మాచర్ల, అడిగొప్పల మలుపు కేంద్రాలు (లెదర్‌పార్కుల్లో) యువతకు శిక్షణిచ్చాము. మొదటి బ్యాచ్‌ శిక్షణ పూర్తయిన తరువాత మలుపు కేంద్రాలు మూసివేశారు. అప్పటి నుండి ఎప్పటిలాగానే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్నాము. కొరియా వాళ్ళు ఇక్కడ లెదర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి స్థలాలు చూసి పోయారు. లెదర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని వేలాది చర్మకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయి.
పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలి
కోటయ్య, చర్మకారుడు, మాచర్ల

మా తాతల కాలం నుండి చెప్పులు కుట్టుకోవటమే మా వృత్తి. చెప్పుల తయారీపై అధారపడే వారు మన ప్రాంతంలో చాలా కుటుంబాలున్నాయి. తెలంగాణాలోని ఆలియా, మిర్యాలగూడ, కోదాడకు చెందిన ప్రైవేటు చెప్పుల వ్యాపారులు చెప్పుల తయారీ అర్డర్లు మన ప్రాంత చర్మకారులకు ఇస్తూంటారు. అయితే కొద్ది మొత్తం ఆర్డర్లు కావటంతో పెద్దగా ఆదాయం రాదు. మన ప్రాంతంలో చెప్పులు, బూట్లు, లెదర్‌తో తయారు చేసే వస్తువుల తయారీ పెద్ద పరిశ్రమలు వస్తాయంటున్నారు. ఇక్కడ కంపెనీలు పెడితే మాకు ఉద్యోగాలొచ్చి జీవితాలు బాగుపడుతాయి. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే పరిస్థితి మారుతుంది.

➡️