కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాల నిరసన

Nov 26,2024 21:53
ఫొటో : నిరసన ప్రదర్శన చేపడుతున్న నాయకులు

ఫొటో : నిరసన ప్రదర్శన చేపడుతున్న నాయకులు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాల నిరసన

ప్రజాశక్తి-కావలి : కేంద్ర సంయుక్త కిసాన్‌ మోర్ఛా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం కావలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలకు చెందిన కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ఏరియా ఆస్పత్రి వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి కోర్టు సెంటర్‌, శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ, మీదుగా తిరిగి ఉదయగిరి బ్రిడ్జి కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు నల్ల చట్టాలను తీసుకుని వచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు తగిన నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తూ, కేంద్ర సంస్థలను అదానీ లాంటి వారికి కారు చౌకగా కట్టబెడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన విశాఖ స్టీల్‌ ప్లాంటును కూడా ప్రయివేటీకరించాలని చూస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు కూడా తగిన నిధులు కేటాయించడం లేదన్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించి కరెంటు ఛార్జీలను ప్రజలు రైతుల నుండి దోపిడీ చేయాలని చూస్తుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటీకరణ ఆపాలని, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలని, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతున్నామన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు చిన్ని రాజగోపాల్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఇప్పటిదాకా ప్రజలకు కార్మికులకు ఎన్‌డిఎ ప్రభుత్వం మేలు ఏమీ చేయకపోగా అధిక ధరలు పెట్రోల్‌ డీజిల్‌ ఛార్జీలు పెంపు ట్రూఅప్‌ కరెంటు ఛార్జీలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగి పోతుందన్నారు. కార్మికులు, రైతులు స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆ విధానాలకు మద్దతు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెండూ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇంకా రైతు నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, గడ్డం మాల్యాద్రి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాసం నాయకులు టి.మాల్యాద్రి, రైతు సంఘం నాయకులు రావి మాల్యాద్రి, సిపిఐ నాయకులు దర్గాబాబు, సిఐటియు నాయకులు తురక శీను, ఎం పోలయ్య, బి.మహేష్‌, ఒంగోలు రమేష్‌, ఎఐటియుసి నాయకులు మల్లి.అంకయ్య, ఎండ్లూరి.ఆదినారాయణ, రావినూతల వెంకటేశ్వర్లు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️