విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి : వామపక్ష కార్మిక సంఘాలు నిరసన

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక వామపక్ష కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ, సిఐటియు జిల్లా కార్యదర్శిలు నాగ సుబ్బారెడ్డి, మనోహర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన పోరాటాల నిర్వహిస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వా నికి ఏమాత్రం చలనం లేదని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే విధంగా సొంత గనుల కేటాయించకుండా నష్టాల బాటలోనికీ తెచి ప్రైవేటీకరణ చేస్తున్నదని ద్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతున్నదని మండిపడ్డారు. దేశంలోని నవరత్నాలు లాంటి కంపెనీలన్నీ ఆదానీ, అంబానీ కి దారాదత్తం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో నిధులు నామాత్రంగా కేటాయించి విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం కుట్ర పందుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు పట్ల స్పష్టత చెప్పారు. విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయిస్తే లాభాల బాటలోకి వస్తుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ లో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పరం చేస్తే కార్మికులు రోడ్డుపాలు అవుతారని తెలిపారు. ఒకప్పుడు విశాఖపట్నం ఎందరో త్యాగాలు బలిదానాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నారని చెప్పారు. నేడు అధికారంలో ఉన్న పాలకవర్గాలు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం చాలా బాధాకరమని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రానున్న కాలంలో సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడాతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులు రెడ్డి, ఏఐటియుసి జిల్లా నాయకులు సుబ్బరాయుడు, రామారావు, పుల్లయ్య, అంకుశం, నాగిరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, మహిళా సంఘం నాయకురాలు భాగ్యమ్మ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి, సిఐటియు నాయకులు గోపి, స్టీఫెన్‌, లక్ష్మీదేవి, యువజన సంఘం నాయకులు విజరు, ఉదరు పాల్గొన్నారు.

➡️