లెనిన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విజరుకుమార్, ఇతర నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కార్మికవర్గ రాజ్యం స్థాపన కోసం కార్ల్‌మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ సిద్ధాంతాలకు ఆచరణ రూపం ఇచ్చిన సోవియట్ యూనియన్ విప్లవ సారధి లెనిన్ అని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో లెనిన్ 101వ వర్థంతి సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ చిత్ర పటానికి విజరు కుమార్ పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నరసరావుపేట మండల కన్వీనర్ డి.శివకుమారి అధ్యక్షతన నిర్వహించిన సభలో విజరుకుమార్ మాట్లాడుతూ సోవియట్ రష్యా విప్లవ నేపథ్యం, లెనిన్ పాత్రను వివరించారు. కార్పొరేట్ దోపిడీ ప్రభుత్వాల స్థానంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ, ఎ.లక్ష్మిశ్వరరెడ్డి మాట్లాడుతూ కష్టజీవుల రాజ్యాన్ని నిర్మించిన మహానేత లెనిన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నివాళి అన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల హక్కుల కోసం సంఘాలు పెట్టాలని లెనిన్ తొలిగా ప్రతిపాదించారని తెలిపారు. బలమైన కమ్యూనిస్టు పార్టీని ఎలా నిర్మించాలో తన రచనల ద్వారా చెప్పారన్నారు. లెనిన్ స్ఫూర్తితో నేడు దేశంలో, రాష్ట్రంలో పాలక పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడదామన్నారు. సభలో నాయకులు టి.పెద్దిరాజు, షేక్ సిలార్ మసూద్, సయ్యద్ రబ్బాని, కె.హను మంతరెడ్డి, జి.బాలకృష్ణ, బి.వెంకటేశ్వర్లు, కె.కోటేశ్వరరావు, శివరామకృష్ణ, అప్పిరెడ్డి, మస్తాన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎం.ఆంజనేయులు, గాంధీ స్మారక సమితి నాయకులు ఈదర గోపిచంద్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
