ప్రజాశక్తి – సింహాద్రిపురం/ లింగాల పులివెందుల నియోజక వర్గంలోని లింగాల, సింహాద్రిపురం మండల సరిహద్దు గ్రామమైన రామాపురంలో విద్యుదాఘానికి మగ చిరుతపులి మతి చెందింది. వివరాలు.. లింగాల మండలం రామాపురానికి చెందిన భరత్ కుమార్ రెడ్డి అనే రైతు తోటలో అడవి పందుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి విద్యుత్ తీగలను అమర్చారు. ప్రమాదవశాత్తు చిరుత పులి విద్యుత్ తీగలకు తగులుకొని షాక్ కొట్టి బలైపోయింది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. నియోజవర్గంలోని లింగాల మండలం రామాపురంలో చిరుత పులి మతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఐదు రోజుల కిందట విద్యుత్ తీగలకు తగులుకొని చిరుత అక్కడికక్కడే మతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు సమీపంలోని గుట్టలో గుంతతీసి పాతిపెట్టారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఫొటోలు వైరల్ కావడంతో ముద్దనూరు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా రైతును గుర్తించి చనిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత పులిపూడ్చిన ప్రదేశానికి వెళ్లి గోతి తీసి పూడ్చిపెట్టిన చిరుతను బయటకు తీశారు. అనంతరం చిరుతకు పోస్టుమార్టం చేశారు.వన్య ప్రాణులు చంపడం నేరం..వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద చిరుతపులిని చంపడం చట్టరీత్యా నేరమని ముద్దనూరు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం చిరుత మతికి సంబంధించిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు . తమకు అందిన సమాచారం మేరకు రామాపురానికి వెళ్లి సంబంధిత రైతులను విచారించామని చెప్పారు. రైతు పొలంలోనే విద్యుత్ తీగలు తగలడం కారణంగా చిరుత మతి చెందిందని విచారణలో వెల్లడైందన్నారు. దీంతో పూడ్చిన స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ చిరుత మతదేహం కనిపించింది అన్నారు. తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా ప్రశ్నిస్తే అటవీ శాఖ వారికి సమాచారం తెలియజేయాల్సిన విషయం తెలియదని చెప్పారన్నారు. రైతును వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేస్తామని డిఆర్‌ఒ తెలిపారు.
