ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : సంఘసంస్కర్త సామాజికవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని టిడిపి కర్నూలు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ అన్నారు. జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు బి.సి సెల్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ తెలుగుదేశంపార్టీ బిసి నాయకులతో కలిసి జ్యోతిరావు పూలె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ… సమాజంలో ఉన్న వర్ణ, కులవివక్షతను రూపుమాపడంలోను, స్త్రీలకు సమానత్వం కల్పించడం లోను, బాల్య వివాహాలను వ్యతిరేకించడం లోను, వితంతువులు పునర్వివాహం చేసుకునడంలోనూ పూలే ప్రోత్సహించారన్నారు. సమాజిక వర్గ విభేదాలను రూపుమాపేందుకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి సమానత్వం కల్పించేందుకు అనునుత్యం పోరాటం చేశారన్నారు. స్త్రీలకు విద్య అవసరం అన్న సత్యం గ్రహించి ముందుగా తన ఇంటి నుండే స్త్రీలకు విద్యాబ్యాసాన్ని నేర్పించేందుకు పూనుకొని వారి సతీమణి సావిత్రిబాయి పూలేతోనే ప్రారంభించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహిళలకు ప్రత్యేకంగా విద్య కోసం పాఠశాలను ఏర్పాటు చేయించిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. డాక్టర్ బాబా సాహెబ్ అంబెద్కర్ కు జ్యోతిరావు పూలే గురువు అంటూ వారి ఆశయాలను చిరసా వహిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల కల్పనకై రాజ్యాంగంలో పొందుపర్చారంటే పూలె ముందు చూపు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదని అన్నారు. తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు, జ్యోతి రావు పూలేని ఆదర్శంగా తీసుకొని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బడుగు బలహీన వర్గాల వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించారన్నారు. బడుగు వర్గాల వారిని రాజకీయంగా ప్రొత్సహించారని నేడు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారి ఆదర్శాలకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తూ రిజర్వేషన్లను పెంచి ప్రోత్సాహించారని గుర్తు చేశారు. నేటి యువతరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బి.సి నాయకులు నాగరాజు యాదవ్, సత్రం రామక్రిష్ణుడు, జె. తిరుపాల్ బాబు, విజయ్ కుమార్, కె.మహేష్ గౌడ్, బేతం క్రిష్ణుడు, వెంకటరాముడు, రామక్రిష్ణ, సోమిశెట్టి నవీన్, దరూర్ జేమ్స్, మైనార్టీ నాయకులు షేక్షావలితో పాటు బి.సి నాయకులు పాల్గొన్నారు.