మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం : సినీ నటుడు సాయికుమార్‌ పిలుపు

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని సినీ నటుడు సాయికుమార్‌ పిలుపునిచ్చారు. పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం మాదకద్రవ్యాలు నివారణకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్‌.ఎస్‌.ఎస్‌ డిగ్రీ కళాశాల నుంచి సూర్య రెసిడెన్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదకద్రవ్యాలు వలన కలిగే అనార్దలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిస కావడంతో యువత, విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని యువత, విద్యార్థులను కోరారు. ఒత్తిడిని ఎదుర్కొంటే మంచి భవిష్యత్తును పొందవచ్చునని చెప్పారు. విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. డబ్బింగ్‌ చెపుతూ మొదటి సంపాదన రూ 250 తీసుకుని తల్లికి ఇస్తే ఎంతో ఆనందం పొందినట్లు చెప్పారు. దేశం మనకు ఏమి చేసింది అనకుండా దేశానికి మనం ఏమి చేశామో లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. తెలిసో తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కోరారు. దేశ రక్షణలో పోలీసులు పాత్ర కీలకమన్నారు. సొసైటీను మంచి మార్గంలో నడిపించేందుకు సినిమా పాత్రలలో నటిస్తున్నాని చెప్పారు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాదించవచ్చునని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ కు విద్యార్థులు, యువత బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భవిష్యత్తును కాపాడుకోవాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్‌ అమ్ముకునేందుకు మొదటిలో డ్రగ్స్‌ అలవాటు చేసేందుకు ఉచితంగా ఇచ్చిన బానిసైన తర్వాత డ్రగ్స్‌ అమ్ముకుని సొమ్ము చేసుకుంటారని, డ్రగ్స్‌ కు అలవాటు పడవద్దని కోరారు. డ్రగ్స్‌ కు బానిస అయితే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్‌ నివారణకు ఎన్‌.డి.పి.ఎస్‌ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. డ్రగ్స్‌ తో పట్టుబడితే బెయిల్‌ కూడా రాదన్నారు. డ్రగ్స్‌ పై సమాచారం కోసం కళాశాలలో డ్రాప్‌ బాక్స్‌ పెడతామని, డ్రగ్స్‌ వినియోగం, అమ్మకాలపై లిఖిత పూర్వకంగా డ్రాప్‌ బాక్స్‌ లో వేయాలని కోరారు. డిఎస్పీ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్‌ తో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్‌ వినియోగించిన, అమ్మినవారి వివరాలు ఇస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి తాగితే 6నెలలు, గంజాయి రవాణా చేసిన, అమ్మిన 10 నుంచి 20 ఏళ్లు వరకు జైలుశిక్ష పడుతుందన్నారు. డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నివారిస్తామని, డ్రగ్స్‌ కు దూరంగా ఉంటామని, మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని విద్యార్థులు, యువతలో ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ రాఘవులు, వాసు విద్యా సంస్థల కరస్పాండెంట్‌ రౌతు వాసుదేవరావు, తాండ్రపాపరాయ కళాశాల కరస్పాండెంట్‌ తూముల కార్తీక్‌, సిఐ బి.వెంకటరావు, పట్టణ సిఐ కె.సతీష్‌ కుమార్‌, ఎస్‌ఐలు జ్ఞానప్రసాద్‌, వి.ప్రసాద్‌, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️