కలిసి అభివృద్ధి చేసుకుందాం

Oct 31,2024 00:06

ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : టిడిపి, జనసేన, బిజెపి కృషితోనే రాష్ట్రంలో కూటమి గెలుపు సాధ్యమైందని, మూడు పార్టీలు సమైక్యంగా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఓ ఫంక్షన్‌ హాలులో బుధవారం పల్నాడు జిల్లా కూటమి నాయకుల ఆత్మీయ, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్‌ అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛనును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచామని, దీపావళి కానుకగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని జిల్లా ఏరియా వైద్యశాలలో త్వరలో ప్రారంభిస్తామని, కోడెల స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి ఆలపాటిని గెలిపించాలన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో రోడ్లు, రైల్వే లైన్లు, హెల్త్‌, స్పోర్ట్స్‌, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాలకు సంబంధించి రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. అమృత్‌ పథకం ద్వారా జిల్లాలోని ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 16437 టీచర్‌ పోస్టులను భర్తీకి సిఎం చంద్రబాబుసంతకం చేశారన్నారు. త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులను కూటమి అధినాయకులు భర్తీ చేస్తారని చెప్పారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కక్ష పూరిత రాజకీయాలు, అల్లర్లు సృష్టించవద్దని, వివాదాలకు తావు లేకుండా పాలన ఉండాలని చంద్రబాబు చెప్పారని అన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టినా, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా మిన్నకుండిపోయామని అన్నారు. అధినేత ఆదేశిస్తే అవినీతి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజలను వేధింపులకు గురి చేసిన వైసిపి నాయకులు రాష్ట్రం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు మాట్లాడుతూ టిడిపి సానుభూతి పరులన్న నెపంతో రైతులపై రౌడీషీట్‌ తెరిపించిన ఘనత వైసిపిదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాస రావు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్‌, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కూటమి పార్టీల నాయకులు కోడెల శివరామకృష్ణ, మక్కెన మల్లికార్జున రావు, ఎ.సుధాకర్‌ బాబు, గాదె వెంకటేశ్వ ర్లు, డాక్టర్‌ కె.లలిత్‌ సాగర్‌, జి.కోటేశ్వర రావు, కె.విజరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️