ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : ఆర్టీసీ రంగ పరిరక్షణ కొరకు పోరాడుదాం అని సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి అంజిబాబు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి జె .దివాకర్, ఎస్ .డబ్ల్యూ. ఎఫ్ రీజినల్ కార్యదర్శి రాయుడు పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక కర్షక భవన్ నందు ఎస్ .డబ్ల్యూ.ఎఫ్ యూనియన్ 2025 సంవత్సరపు నూతన డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కొరకు ప్రతి కార్మికుడు ఐక్య ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. చాప కింద నీరులా ఆర్టీసీని ప్రైవేటు వరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైర్ బస్ రూపంలో ప్రైవేటీకరణ జరిగిందని మళ్లీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో మరింత ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే నిర్వహించే విధంగా ఒత్తిడి తీసుకొని రావడానికి అన్ని కార్మిక సంఘాలు ఉద్యమించవలసిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔర్సోర్సింగ్ కార్మికులకు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు. వారికి పని భద్రత లేదని, ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ కార్మికులు అభద్రతాభావంలో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాబోవు కాలంలో ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎస్ డబ్ల్యూ.ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని వారు తెలియజేశారు.