పోర్టు ఆసుపత్రి టెండర్లకు వస్తే తరిమికొడదాం

విశాఖ పోర్టు హాస్పిటల్‌

ప్రజాశక్తి- సీతమ్మధార : విశాఖ పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు ఆదివారం 125వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఆలిండియా వాటర్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిడి నందకుమార్‌, టి.నరేందరరావు మాట్లాడుతూ పోర్టు హాస్పిటల్‌ టెండర్‌కు వచ్చిన వారిని ఐక్య పోరాటాలు ద్వారా అడ్డుకుని, తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో విద్య, వైద్యానికి సరైన కేటాయింపులు చేయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, పోర్టు భూములను అద్దెకిచ్చి, ఆస్తులను ప్రయివేటుపరంగా చేయాలని చూస్తోందని, అందులో భాగంగా ఆధునికీకరణ పేరుతో విశాఖ పోర్టు ఆసుపత్రి ప్రయివేటీకరణ అన్నారు. పోరాటాలతో టెండర్‌ను అడ్డుకున్న విధంగానే, పోర్టు ప్రయివేటు పరం కాకుండా ఉద్యమిద్దామని, దీనికి ఆలిండియా కోఆర్డినేషన్‌ కమిటీలోని ఆరు ఫెడరేషన్లు పూర్తి మద్దతుస్తున్నాయన్నారు. పోర్టు ఆసుపత్రి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పోర్టులో కార్మికుల ఒక రోజు నిరసన తెలియజేస్తామన్నారు.సి డి నందకుమార్‌ మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్‌ఫండ్స్‌, విలువైన వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ ప్రైవేటీకరణ నిర్ణయం అన్యాయమని, దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి కార్యదర్శి మసేన్‌ అధ్యక్షతన దీక్షల్లో ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, జాతీయ నాయకులు, సిఐటియు నాయకులు కె. సత్యనారాయణ, జె.సత్యనారాయణ, రామలింగేశ్వరరావు, శంకరరావు, కెఎస్‌ కుమార్‌, రాఘవులు, విజయకుమార్‌ నాయుడు పాల్గొన్నారు.

దీక్షల్లో మాట్లాడుతున్న నరేంద్రకుమార్‌

➡️