మళ్లీ అగ్రతాంబూలం!

Jun 10,2024 00:44

ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నమూనాను పరిశీలిస్తున్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
ఐదేళ్ల తరువాత రాజధాని గ్రామాలకు మళ్లీ జీవం వచ్చింది. గ్రామాల్లో రాజధాని కళ సంతరించుకుంటోంది. 2019 మేనెల వరకు కళకళలాడిన గ్రామాలన్నీ వైసిపి అధికారంలోకి రావడంతో కళ తప్పాయి. ఎటువంటి కార్యకలాపాలూ లేక వెలవెలబోయాయి. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో అప్పటి సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడంతో రాజధాని గ్రామాల్లో కలకలం చెలరేగింది. నిర్మాణ సంస్థలన్నీ వెనుదిరిగాయి. ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయి. ఒక్కసారి అయోమయం సంతరించుకుంది. రైతులు ఉద్యమ బాటపట్టారు.1630 రోజులపాటు ఉద్యమం కొనసాగించారు. ఐదేళ్ల తరువాత ఎట్టకేలకు ప్రభుత్వం మారింది. అమరావతి అభివృద్ధిలో కదలిక వచ్చింది. సిఎంగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన మౌఖిక ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాలకు తరలి వస్తున్నారు. ఏకంగా రాజధానిగ్రామాల్లో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సిఆర్డిఏ అధికారులతో కలిసి పర్యటించారు. ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సిఎస్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్ళుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రస్తుతం ఆ పనులన్నీ శరవేగంగా పున:ప్రారంభం అయ్యేందుకు అవకాశం ఉన్నందున సిఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఛార్జి తీసుకున్న రెండు రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా రాజధాని ప్రాంతంలో 83 జెసిబిలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంఖు స్థాపన ప్రాంతంలోను, సీడ్‌ యాక్సిస్‌ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్‌ ప్లాన్‌ లోని ప్రధాన రహదారులు వెంబడి చిన్న చిన్న మరమ్మత్తులు నిర్వహించడం, తుప్పలు తొలగించడం, విద్యుత్‌ దీపాల పునరుద్ధరణ వంటి పనులను సిఆర్డిఏ అధికారులు చేపట్టారు. సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా రాజధానిగ్రామాల్లో పర్యటిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులపై మళ్లీ ఒక ప్రణాళికను విడుదల చేస్తారని తెలిసింది. గతంలో 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగిన సమయంలో ప్రస్తుత సిఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా ఉండడంతో ఆయనకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులపై పూర్తి అవగాహన ఉంది. సిఎస్‌ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో భూమిపూజ జరిగిన ఉద్దండరాయునిపాలెంలోని సిఆర్‌డిఎ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎపి ఎన్జిఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను పరిశీలించారు. 10 ఎంఎల్డి వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, హేపీనెస్ట్‌ వంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైకోర్టు అదనపు భవన సముదాయాన్నీ సిఎస్‌ పరిశీలించారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంతంలో పనులను శరవేగంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై సిఆర్‌డిఎ అధికారులతో చర్చించారు.

➡️