యాక్సిడెంట్ బాధితులకు సహాయం అందించుదాం – ప్రాణాలు కాపాడుదాం

Jan 16,2025 16:06 #Kadapa

ప్రజాశక్తి – కడప : గుడ్ సమరిటన్ గా యాక్సిడెంట్ బాధితులకు సహాయం అందించుదాం – ప్రాణాలు కాపాడుదామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు 2025 పురస్కరించుకొని ” దారి భద్రత ప్రచారం” – (శ్రద్ధ వహించండి)” కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ..  36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు 2025లో భాగంగా ఈనెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు  మాసం రోజులపాటు” దారి భద్రత ప్రచారం” – (శ్రద్ధ వహించండి)” ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గుడ్ సమరిటన్ గా యాక్సిడెంట్ బాధితులకు సహాయం అందించుదాం – ప్రాణాలు కాపాడుదాం మని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్) లోపు బాధితులకు సరైన వైద్య చికిత్స అందించితే ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. గుడ్ సమ రిటన్ రహదారి ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా సహాయం అందించి, దగ్గరలోని హాస్పిటల్ కు చేర్చాలన్నారు. గుడ్ సమరిటన్ కు రూ.5 వేలు వరకు నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఇవ్వబడును అని చెప్పారు. మోటారు వెహికల్ యాక్ట్, 1988లోని సెక్షన్ 134ఏ, సీఎంవి రూల్స్ 168 & 169ల ద్వారా చట్టబద్ధమైన రక్షణ “గుడ్  సమరిటన్ ” లకు కల్పించబడిందన్నారు. బాధితుడికి,  సహాయపడుట, ఎటువంటి సివిల్/ చర్యలు ఉండవు, పోలీసు నుండి ఇబ్బందులు ఉండవు, హాస్పిటల్ వద్ద నిరీక్షించనవసరం లేదు, ఎటువంటి హాస్పిటల్ బిల్లులు, మందుల ఖర్చులు అవసరం లేదు. అలాగే మీ వివరాలు తెలుపుట మీ ఇష్టం కంపల్సరీ కాదు అని అన్నారు.
మద్యం సేవించి వాహనం నడపరాదని, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరమని అన్నారు. సీట్ బెల్ట్ ధరించాలని, భద్రంగా గమ్యం చేరాలని అన్నారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణించరాదన్నారు. పరిమితికి మించి విద్యార్థులను వాహనంలో ఎక్కించుకున్నా, 60 సంవత్సరాలు వయసు దాటిన వారు డ్రైవింగ్ చేసినా, పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన, మోటారు వాహన చట్టం సెక్షన్ 192(ఏ) ప్రకారం రూ.10వేలు జరిమానా  జైలు శిక్ష విధించబడునని అన్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపుట అత్యంత ప్రమాదకరమన్నారు. హెల్మెట్ ధారణ – ప్రాణానికి రక్ష అన్నారు. అధిక వేగం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. హెచ్చరిక/ జాగ్రత్తలను సూచించే గుర్తులను గమనించాలన్నారు. ట్రాఫిక్ గుర్తులు తప్పక పాటించవలసిన సూచనలను తెలుసుకోవాలన్నారు. మితిమీరిన వేగం ప్రమాదాలకు మూలమని, భద్రతే మన జీవితానికి నేస్తం, అది లేకుంటే జీవితం అస్తవ్యస్తం అవుతుందన్నారు. తొలుత 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు 2025 పురస్కరించుకొని ” దారి భద్రత ప్రచారం” – (శ్రద్ధ వహించండి)” కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించారు. సమావేశంలో  జేసీ అదితి సింగ్,  డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, జడ్పి సీఈవో ఓబులమ్మ,  కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీఓ లు జాన్ ఇర్వీన్, సాయిశ్రీ, చంద్రమోహన్,  మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇంచార్జి సీపీవో హజ్రతయ్య,  అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️