ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : కాల్వ చివర భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని నాగార్జునసాగర్ కుడికాల్వ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు అన్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ ప్రాజెక్ట్ కమిటీ తొలి సమావేశం సత్తెనపల్లి జలవనరుల శాఖ అతిథి గృహంలో చైర్మన్ పులుకూరి కాంతారావు అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు హాజరయ్యారు. మేజర్ కాల్వల చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాల్వలను ఆక్రమించుకొని ప్లాట్లు వేశారని పలువురు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అధికారులు దృష్టికి తెచ్చారు. కుడి కాల్వ పరిధిలో లస్కర్ల సమస్య తీవ్రంగా ఉందని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా నామినేషన్ ద్వారా సాగునీటి కాల్వల మరమ్మతు పనులను సాగునీటికి సంఘాలకు ఇవ్వాలని పలువురు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. సమావే శంలో ప్రాజెక్టు కమిటీ వైస్‌చైర్మన్ ఉప్పలపాటి చక్రపాణి, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న 48 మంది డిసీ చైర్మన్‌లు, జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ ఎం.మురళీధర పాల్గొన్నారు.