ప్రజాశక్తి-కొండపి : మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు సమానత్వం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. పెరిదేపి గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 1911లో సోవియట్ రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటిగా జరిగిందని తెలిపారు. 1977 నుంచి ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. మహిళలు, ప్రజాతంత్రవాదులు చేసిన అనేక పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు హక్కులు మహిళలు సాధించుకోగలిగారని, వాటిని నిలబెట్టుకోవా లన్నా, సమానత్వాన్ని సాధించాలన్నా మళ్లీ పోరాటాలు చేయటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో అటువంటి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు అంగలకుర్తి బ్రహ్మయ్య మహిళా ఉద్యమానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. సభకు ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు ఏ విశ్రాంతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి ఏ మాధవి, ఎం సంపూర్ణ, ఏ పద్మ, సిహెచ్ సునంద, ఎం నిర్మల, ఏ. సుభాషిణి, ఎం సింగమ్మ, ఏ అంజమ్మ, ఎం నల్లమ్మ, ఎల్ ఎస్తేరమ్మ, ఏ ఎలిసమ్మ, జి ఎలమందమ్మ, ఎల్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు: పురాతన కాలం నుంచి నేటి వరకు మహిళలు అణచివేతకు గురవుతూనే ఉన్నారని మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పమిడి హరిణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మైనంపాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. డాక్టర్ హరిణి మాట్లాడుతూ పిల్లలను ప్రేమానురాగాలతో పెంచి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. మహిళలు తమ హక్కుల సాధన కోసం చైతన్య స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఐద్వా మండల కార్యదర్శి నెరుసుల మాలతి మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం మహిళంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమానికి కిలారి రాజ్యం అధ్యక్షత వహించగా ఐద్వా మండల అధ్యక్షురాలు బంకా పద్మ, నాయకులు అద్దంకి యేసుమణి, కే విజయ, పి రాధ తదితరులు పాల్గొన్నారు.
