- వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు జాలా అంజయ్య పిలుపు
ప్రజాశక్తి -ప్రకాశం : వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి కాపాడుతానని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ మాటలు నీటి మూటలు అయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు జాలా అంజయ్య విమర్శించారు. స్థానిక ఎన్జీవో భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ నల్లధనం తెచ్చి పేదరిక నిర్మూలన చేస్తానని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దనెక్కిన మోడీ ప్రజల్ని పచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటుపరం చేస్తూ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే తరగతులకు అవకాశం లేకుండా చేస్తూ సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నారని అన్నారు. సామాన్య ప్రజలు ప్రయాణించే రైళ్లను ఏసీ రైల్లుగా మార్చి పేదలకు వున్న కొద్దిపాటి ప్రయాణ సౌకర్యాన్ని కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు, నిత్యవసర వస్తువుల ధరలు నిత్యం పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా, రాజధాని నిర్మాణానికి నిధులు, విభజన హామీలను విస్మరించి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని అటువంటి మోడీకి, బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన బిజెపికి మన రాష్ట్రంలోని వైసీపీ, టిడిపి, జనసేన లాంటి పార్టీలు వంత పలుకుతున్నాయని, ఇది తెలుగు ప్రజలకు అత్యంత అవమానకరమని అన్నారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చలేదని, దానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఈ మూడు పార్టీలు చేయటం లేదని అన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని బలపరచాలని వ్యవసాయ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు సమావేశంలో గత కార్యక్రమాల రిపోర్టును, భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టగా కార్యకర్తలు చర్చించి కర్తవ్యాలను రూపొందించుకున్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కేజీ మస్తాన్, బడుగు వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు, అంగలకుర్తి బ్రహ్మయ్య, ఉబ్భా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.