విశాఖ : పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద సిఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నర్సింగరావు, యూనియన్ అధ్యక్షులు వి యస్ పద్మనాభ రాజు మంగళవారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్టు డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్ అయిన కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్ కళాశీలకు, సిహెచ్‌డి క్యాజువల్ కార్మికులకు, సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగులు వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి 35 వేల కుటుంబాలకు సేవలందిస్తున్నది. అలాంటి పోర్టు హాస్పిటల్ ను పిపిపి పద్ధతిలో ”మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” గా 300 పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయాన్ని సిఐటియు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. ఇదే గనుక అమలయితే పోర్టు డాక్ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలు (సుమారు 35 వేల మంది) ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుందన్నారు. ప్రైవేటు యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. పోర్టుల్లో పిపిపి/బిఓటి విధానాలు విఫలమయ్యాయని గతంలో స్వయంగా ‘కాగ్’ (కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్) మొట్టికాయలు వేసిన సంగతి విదితమే. ప్రైవేటు వాడి చేతుల్లోకి వెళితే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు. అప్పుడు వైద్యం వేలాదిమంది పోర్టు డాక్, పెన్షనర్ల, పూల్, కాజువల్ కుటుంబాలకు దూరమవుతుంది. మొదట్లో బ్రహ్మాండంగా ఉంటుందని భ్రమ పెడతారు. అనంతరం ఇది ఒప్పందంలో లేదు, అది ఒప్పందంలో లేదు, ధరల పెరిగాయి, ఇది వర్తించదు అది వర్తించదు, మీరు డబ్బులు చెల్లిస్తే గాని కుదరదని ఖరాఖండిగా చెబుతారు. ప్రజలపై అదనంగా మోయలేని భారం పడుతుంది. కరోనా మహమ్మారి కాలంలో ప్రయివేట్ ఆసుపత్రులు ఎంతలా దిగజారి ప్రజలను దోచుకున్నాయో మన కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఉద్యోగులు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. 90 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా రాత్రనకా, పగలనకా చెమటోడ్చి పోర్టును ఈ ఉన్నత స్థితికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చిన ఉద్యోగ, కార్మిక, రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గించాలన్న నెపంతో ప్రైవేట్ వారికి కట్టబెడతామన్న దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. ఉద్యోగులు, కార్మికులు పొందే వైద్యాన్ని లాభనష్టాలు బేరీజు వేయడం దుర్మార్గం. ‘మెరుగైన వైద్యం అందించడం యాజమాన్యం బాధ్యత-పొందడం ఉద్యోగ, కార్మికుల హక్కు’. పోర్టుల హాస్పిటల్స్ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఫెడరేషన్ల అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తామని గతంలో హామీ ఇచ్చిన ఐపీఎ మాట తప్పింది. పోర్టులోనున్న కార్మిక సంఘాలన్నీ ఏకపక్షంగా పోర్టు హాస్పటల్ ను ప్రైవేటీకరించొద్దని స్పష్టంగా చెప్పాయి . ఏపీ హైకోర్టు కూడా హాస్పిటల్ విషయమై కార్మిక సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పింది. కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా గోల్డెన్ జూబ్లీ హాస్పటల్ ప్రైవేటుకు ఇవ్వడానికి యాజమాన్యం, ప్రభుత్వం ముందుకెళ్లడం చూస్తే ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. పోర్టుకు ఈ సంవత్సరం రూ.386 కోట్లు లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం రూ.171 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నది. వేల కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి వాటి నుంచి పోర్టు హాస్పిటలను అభివఅద్ధి చేయాలని సిఐటీయు డిమాండ్ చేస్తుందని నేతలు వివరించారు. ఈ దీక్షలో యునైటెడ్ పోర్ట్ డాక్ లో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సత్యనారయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.రామలింగేశ్వర రావు, విడిఎల్‌బి డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జక్కన్న సత్యనారాయణ, వీర రాఘవులు, రిటైర్డ్ ఉద్యోగులు నాయకులు, రామారావు, తదితరులు పాల్గన్నారు.