గాంధీ స్ఫూర్తితో పోర్టు హాస్పిటల్‌ను కాపాడుకుందాం

Oct 3,2024 00:14 #Port hospital deekshalu
Port Hospital deekshalu

 ప్రజాశక్తి- సీతమ్మధార : మహాత్మాగాంధీ స్ఫూర్తితో పోర్టు హాస్పిటల్‌ను కాపాడుకుందామని యునైటెడ్‌ పోర్టు అండ్‌ డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు విఎస్‌.పద్మనాభరాజు పిలుపునిచ్చారు. విశాఖ పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణ ఆపాలనీ కోరుతూ మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షలను పద్మనాభరాజు ప్రారంభించారు. ముందుగా శిబిరంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మనాభరాజు మాట్లాడుతూ, రూ.222 కోట్లు పెట్టుబడితో మల్టీస్పెషల్టీ హాస్పిటల్‌గా మారుస్తామని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. పోర్టు దగ్గర సొంత నిధులు రూ.వేల కోట్లు ఉన్నాయని, వాటితోనే అభివృద్ధి చేయాలని డిమాండ్‌చేశారు. విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టు చాలా కీలకమైందన్నారు. పోర్టు పన్నుల రూపంలో ప్రభుత్వాలకు రూ.171.42 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణపై అందరి సంతకాలు సేకరించి రక్షించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ దీక్షలో జె.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, ఈశ్వరరావు, శ్రీను, రామారావు, వెంకటరావు, బి.జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️