ప్రజాశక్తి-అనకాపల్లి
ఆరుద్ర పురుగులను రక్షించుకొని జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆదివారం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ, గ్రీన్ క్లబ్ సభ్యులతో ప్రదర్శన నిర్వహించారు. గ్రీన్ క్లబ్, అన్నమాచార్య వాగ్గేయ వరదాయని సంయుక్త ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం బట్లపూడి గ్రామంలో సోహం స్వచ్ఛంద సంస్థ ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను నాటారు. సందర్భంగా గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ మాస్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఆరుద్ర పురుగులు కనిపించడాన్ని రాబోయే వర్షానికి సూచికగా భావిస్తారని, వీటిని రైతు మిత్రులుగా, జీవ సంబంధ నియంత్రకాలుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఆరుద్ర పురుగులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నేడు రసాయనక మందులు పురుగుమందులు కారణంగా వీటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. విశ్రాంత అటవీశాఖ రేంజర్ బి వినోద్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవాళిని బెంబేలెత్తిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అన్నమాచార్య వాగ్గేయ వరదాయని వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి, ఎస్‌ఎఫ్‌ఐ సత్యనారాయణ, మల్ల లోకేష్, బేతాళం శేష సాయి, ఉమామహేశ్వరరావు, సూరి అప్పారావు, సోహం వ్యవస్థాపకులు కాండ్రేగుల రవికుమార్ పాల్గొన్నారు.