అమెరికా మద్దతుతో చెలరేగిపోతున్న ఇజ్రాయిల్ దుర్మార్గాలను ఖండిస్తూ.. పాలస్తీనాకు ప్రజలంతా అండగా నిలవాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. పాలస్తీనాకు సంఘీభావంగా సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీలు చేపట్టారు.
ప్రజాశక్తి – కలెక్టరేట్
పాలస్తీనాకు సంఘీభావంగా సోమవారం విశాఖలో లలితా జ్యుయలర్స్ నుంచి ఆశీల్ మెట్ట జంక్షన్ వరకు వామపక్షాల ఆధ్వర్యాన శాంతి ప్రదర్శన, అనంతరం మానవహారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు జరిపి, మారణహోమం సృష్టించి నేటికి సంవత్సరమైనా, ఐక్యరాజ్య సమితి అక్కడ శాంతి నెలకొల్పాలని ఆదేశించినా అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చెలరేగిపోతోందన్నారు. ఇప్పటివరకు మన దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా పాలస్తీనాకు మద్దతుగానే ఉన్నారని, చంద్రబాబు మద్దతునిస్తున్న మోడీ తప్ప దేశ, ప్రపంచ వ్యాపితంగా ప్రజలందరూ ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీనియర్ నాయకులు సిహెచ్.నర్సింగరావు, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి ఎస్.గోవిందరాజులు, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకరరావు, సిపిఐ (ఎంఎల్) ప్రజాపోరు నాయకులు దేవా, వామపక్ష పార్టీల నాయకులు ఎస్‌కె. రెహమాన్, ఆర్‌కెఎస్‌వి. కుమార్, జిఎస్‌జె. అచ్యుతరావు, బి.పద్మ, ఎండి.బేగం, రమణి, పుష్పలత, ఎం. మన్మధరావు, పి.చంద్రశేఖర్, సిఎన్.క్షేత్రపాల్, ఎన్.నాగభూషణం, ఎం.శ్రీనివాసరావు, వి.నల్లయ్య పాల్గొన్నారు.
అనకాపల్లి : పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయల్ ఆటవిక దాడులు మొదలు పెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయల్ హమాస్ దాడికి ప్రతీకార దాడి పేరుతో ఇజ్రాయల్ పాలస్తీనాపై విచక్షణారహితంగా క్రూరమైన దాడులకు దిగిందని పేర్కొన్నారు. ఫలితంగా 42 వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారని వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. వాస్తవానికి ఈ సంఖ్య ఆగష్టు 6 నాటికి 85 వేలకు పైగా ఉండవచ్చని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సింగ్ అంచనా వేసిందన్నారు. సిపిఐ నాయకులు వై.ఎన్. భద్రం మాట్లాడుతూ కాల్పులు విరమణకోసం జరుగుతున్న అర్థవంతమైన అన్ని చర్చలను ఇజ్రాయల్ తొక్కేస్తూ, మరోవైపు ఏడాది పొడగునా దాడి కొనసాగిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి మండల కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యన్నారాయణ, అల్లు రాజు, నాయకులు పి.శ్రీనివాసరావు, కె.ఈశ్వరరావు, బుగిడి నూక అప్పారావు, సిపిఐ నాయకులు కోరిబిల్లి శంకరరావు, కొల్లి సత్యారావు, మంద రాము తదితరులు పాల్గొన్నారు.