ప్రజాశక్తి – హిందూపురం (అనంతపురం) : హిందూపురం పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ఐకమత్యంతో పని చేయాలని బాలయ్య పి ఏ వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్. మున్సిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, పట్టణంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య, మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వేసవి కాలం మొదలైందని, నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని వార్డులలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా పైప్ లైన్లు లీకేజీలకు గురవుతుంటే ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. అలాంటి లీకేజీలను త్వరితగతిన మరమ్మత్తు చేయించాలన్నారు. అన్ని వార్డులకు కొళాయి నీరు పంపిణీ చేయాలని, నీటి సమస్యల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. మద్యం సేవించి విధులను నిర్వర్తిస్తున్నట్టు తెలిస్తే, వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా సచివాలయ అమ్యూనిటీ కార్యదర్శులు అన్నివార్డులలో నీటి సమస్యలు ఏ విధంగా తలెత్తుతున్నాయని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అందరూ సమిష్టిగా పనిచేసి నీటి సమస్యలు లేకుండా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఇర్షాద్ అహమ్మద్, ఆయూబ్, ఇన్చార్జి ఎమ్.ఈ. మోహన్, ఇంచార్జీ డి.ఈ.ఈ. ఆనంద్ రాజు, ఏ.ఈ. లు జనార్ధన్, శంకర్, టీడీపీ నాయకులు బాబు, అమ్యూనిటీ కార్యదర్శులు, ఫిట్టర్లు, వాటర్ మెన్ లు పాల్గొన్నారు.
