అంగన్వాడీల సమస్యలపై రాష్ట్రపతి ముర్ముకు లేఖలు

Feb 4,2025 17:21 #Anganwadi, #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత పదేళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్షాన్ని ఆ యూనియన్ నాయకులు ప్రశించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలుగజేసుకొని పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయాలు 4వేల మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం)  కాకినాడ ల్లా అధ్యక్ష, కార్యదర్సులు దడాల పద్మావతి, ఎరుబండి చంద్రవతిలు తెలిపారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.  గతంలో సుప్రీం కోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటి చెల్లించాలని, నాలుగో తరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం  అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా బేఖాతరు చేస్తుందని వారు విమర్శించారు. అంగన్వాడీల పట్ల బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడపబోతున్నామని వారు తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతి ముర్ము కలగజేసుకుని సుప్రీంకోర్టు తీర్పుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ లేఖలు పంపుతున్నట్లు వారు తెలిపారు. ఐసిడిఎస్ బడ్జెట్ ప్రతి సంవత్సరం కుదించబడుతుందని, దీనివల్ల పేద, దళిత, బహుజన పిల్లలకు, గర్భిణీలకు అందే పౌష్టికాహారం దూరమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా మట్టి ఖర్చులు మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదని దీని కోసం ఈ నెల 17, 18, 19 తేదీలలో ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ, వేతనాలు ధరలకు అనుగుణంగా పెంచాలని, యాప్ ల పనిభారన్నీ తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రాజెక్టు ఆఫీసుల ముందు ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలను 4వతరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి, గ్రాడ్యుటి చెల్లించాలని, ఐసిడిఎస్ ను సంస్థాగతం చేయాలని పద్మావతి చంద్రావతిలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు దాడి బేబీ, రాజేశ్వరి, ఎస్తేరు రాణి, వీరమణి, సుజాత, జ్యోతి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, నీరజ, ఎస్ రాణి, శుభరత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️