విస్తృత పోరాటాలతోనే మహిళలకు విముక్తి

Mar 9,2025 21:56

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌:  విస్తృత పోరాటాలతోనే అణచివేత నుంచి మహిళలకు విముక్తి లభిస్తుందని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీదేవి స్పష్టంచేశారు. ఆదివారం సాలూరు పట్టణంలో ఐద్వా, యుటిఎఫ్‌, సిఐటియు, శ్రామిక మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు గౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆర్‌.శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు వి.రామలక్ష్మి మాట్లాడారు. చిన్నారులు, వృద్ధులు అని తేడా లేకుండా మహిళలపై రోజురోజుకు హింస పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ హింసను అరికట్టే యంత్రాంగం గాని, వ్యవస్థ గాని నేటికీ లేదని చెప్పారు. చట్టాలు ఎన్ని ఉన్నా మహిళలపై జరుగుతున్న దాడులు విషయంలో అవన్నీ నీరుగారుతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. పని ప్రదేశాలలో నేటికీ భద్రత లేదని, ప్రతిచోటా ఏదో ఒక రూపంలో వేధింపులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కమిటీలు వేయాలని డిమాండ్‌చేశారు. అన్యాయం జరుగుతున్న చోట ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. దేశంలో సెన్సార్‌ సరిగా లేక మీడియాలో విచ్చలవిడిగా సంస్కృతి, సంప్రదాయాలు పక్కన పెట్టి అశ్లీలత రాజ్యమేలుతుందని చెప్పారు. దేశంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని, ఉద్ధరిస్తామని పదేపదే ప్రధాని నరేంద్ర మోడీ వల్లెవేస్తారని, ఆచరణలో మాత్రం చేస్తున్నది ఏమీ ఉండదని విరుచుకుపడ్డారు. మహిళను కించిపరిచే పదజాలం, భాష పదేపదే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకత్వం ప్రతి ప్రాంతంలోనూ ఉపయోగిస్తోందని, ఇలాంటి భావనతో ఉన్నవారు మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించగలరని ప్రశ్నించారు. యుటిఎఫ్‌ మహిళా నాయకులు రాజమణి, సిఐటియు సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం మహిళా సంఘాలు పోరాడినప్పుడే కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు పోరాడకుండా ఏదీ రాదని చెప్పారు. పెట్టుబడిదారీ సమాజం మూలాలు నేటి సమాజంలో బలంగా వేలూనుకొని ఉన్నాయని, మహిళలంతా ఐక్యంగా ప్రశ్నించేతత్వం అలవర్చుకొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌పి యూనియన్‌ నాయకులు అన్నపూర్ణ ఎండిఎం నాయకులు సుశీల ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగవేణి, రైల్వేస్టేషన్‌ రోడ్డు కాలనీ సంఘం నాయకులు ఈశ్వరమ్మ, యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.జానకి రావు, మండల కార్యదర్శి గణేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం.శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు కె.ఈశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నారాయణమ్మ, నిర్మల, డివైఎఫ్‌ఐ నాయకులు తనూజ్‌, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️