హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ఆస్తి కోసం, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న తండ్రి, కడప లక్ష్మి భవన్‌ హోటల్‌ యజమానిని హత్య చేసిన కొడుకు, కోడలు, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.4 లక్షల జరిమానా విధిస్తూ ప్రొద్దు టూరు సెకండ్‌ ఎడిజె కోర్టు జడ్జి జి.ఎస్‌.రమేష్‌ కుమార్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. తొమ్మిదేళ్ల కిందట మైదుకూరు పరిధిలో దారుణ హత్య కేసులో ముద్దాయిలైన హతుడు ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్య కుమారుడు ముద్దంశెట్టి శివప్రసాద్‌, కోడలు ముద్దంశెట్టి సుప్రజ, ఆమె తమ్ముడు మైలారం జగన్నాథ్‌లకు కోర్టు కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్ష విధించింది. కేసు వివరాలు.. హతుడు ముద్దంశెట్టి వెంకట సుబ్బయ్య (63) కడప నగరంలోని లక్ష్మి భవన్‌ హోటల్‌ను నిర్వహించేవాడు. హతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు నాగరాజుకు సుప్రజతో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కొద్ది కాలం తర్వాత నాగరాజు ఇంటి సమస్యలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో నాగరాజు తండ్రి, హతుడు అయిన వెంకటసుబ్బయ్య తన కోడలు సుప్రజకు హోటల్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. సుప్రజ హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. సుప్రజను మామ వెంకటసుబ్బయ్య మందలించి హైదరాబాద్‌ నగరంలోని చిన్నకొడుకు శివప్రసాద్‌ వద్దకు పంపాడు. సుప్రజ మరిది శివప్రసాద్‌తోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న హతుడి కుమార్తె రాజేశ్వరి తన అన్న శివప్రసాద్‌ను, సుప్రజను మందలించింది. అనంతరం సుప్రజ తన వాటా ఆస్తి తనకు పంచి ఇవ్వాలని మామను కోరగా ఇవ్వనని నిరాకరించాడు. ఆరు ఎకరాల పొలాన్ని సుప్రజ ఇద్దరు ఆడపిల్లలకు పంచుతానని చెప్పాడు. ముద్దాయిలు శివప్రసాద్‌, జగన్నాధ్‌, సుప్రజ వెంకట సుబ్బయ్యను చంపాలని నిర్ణయించుకుని 2014 డిసెంబర్‌ 30న మైదుకూరు సమీపంలోని ముదిరెడ్డిపల్లి పొలాల్లోని హతుడి గెస్ట్‌హౌస్‌కి వచ్చి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. తోటమాలి జి.మహేష్‌ ఫిర్యాదు మేరకు మైదుకూరు పిఎస్‌లో అప్పటి మైదుకూరు అర్బన్‌ సిఐ వై.వెంకటేశ్వర్లు హత్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. కేసును పర్యవేక్షిస్తూ సరైన సమయంలో సాక్షులను కోర్టు హాజరుపరిచి ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత మైదుకూరు అర్బన్‌ సిఐ సయ్యద్‌ హషం, ప్రొద్దుటూరు రూరల్‌ పిఎస్‌ కోర్టు మానిటరింగ్‌ సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.నాగరాజు, మైదుకూరు ప్రాసెస్‌ కానిస్టేబుల్‌ బి.రాజశేఖర్‌ కృషి చేశారు. ప్రాసిక్యూషన్‌ తరపున అడిషనల్‌ పిపి బి.రాంప్రసాద్‌రెడ్డి బలమైన వాదనలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్‌పి వి.హర్షవర్ధన్‌ రాజు అభినందించారు.

➡️