ఉప్పొంగిన కొండవాగులు, గెడ్డలు
రోడ్లుపైకి, జనావాసాల్లోకి వర్షపు నీరు
రాకపోకలకు మన్యవాసుల ఇక్కట్లు
భయం గుప్పెట్లో ముంపు బాధితులు
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కుంభవృష్టి వర్షాలకు కొండవాగులు, వంకలు ఉప్పొంగడంతో రోడ్డుపైకి వర్షపునీరు భారీగా చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లల్లోంచి కాలు బయటపెట్టలేనంతగా వర్షం కురవడంతో జనజీవనం స్థంభించింది. వీడకుండా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా గోదావరి నీటిమట్టం పెరగడంతో ముంపు బాధితుల్లో ఆందోళన నెలకొంది.
ఎటపాక : మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి చెరువులు అలుగు పారుతున్నాయి. కుంటలు నిండుకుండల తయారయ్యాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వారం రోజులుగా ముమ్మురంగా వేస్తున్న వరి నాట్లకు, మిరప నారుమడులు, వ్యవసాయ పనులకు భారీ వర్షంతో బ్రేక్ పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిలోకి ప్రజలు ఎవరూ వెళ్లొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షానికి తోడు ఎగువ నుండి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34 అడుగులు దాటి ప్రవహిస్తుంది. గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతుందనే సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
విఆర్ పురం: మండలంలోని రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు, పొంగటంతో జనజీవనం స్తంభించింది మండలంలో శ్రీరామగిరి నుండి ముద్దుల గూడెం మధ్యలో వాగు పొంగటంతో నాలుగు గ్రామాలు ప్రజలు రాకపోకలు ఆగిపోయాయి. అన్నవరం ఉమ్మడివరం గ్రామం మధ్యలో వాగు పొంగటంతో సుమారుగా 40 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి.చింత రేగుపల్లి, సృష్టివారి గూడెం గ్రామం మధ్యలో రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఏడు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద తగ్గుముఖం పట్టి, ఇళ్లకు చేరుకున్న ముంపు బాధితులు బురద పట్టిన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న పరిస్థితుల్లో, మళ్లీ కుండపోత వర్షంతో బాధితుల్లో అలజడి మొదలైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం మూడు గంటలకు 34.8 అడుగులకు చేరవడంతో ఇంకెన్నాళ్లు పునరావాస కేంద్రాల్లో ఉండాలోయని వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు.
దేవీపట్నం : భారీ వర్షాలకు మండలంలోని ఇందుకూరుపేట ఎం.రావిలంక మధ్య ఇనుకొండ వాగు తెల్లవారుజామున ఉప్పొంగి ప్రవహించడంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎం రావిలంక పోతవరం, పోతుకొండ, దేవారం. శరభవరం, ముసునగుంట కాలనీ, సీతారాం కాలనీ, చిన్నారి గండి కాలనీ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చింతూరు. : కుండపోత వర్షంతో చింతూరు మండలంలోని సోకిలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. బుధవారం చింతూరు వారపు సంత కూడా జనం లేక వెలవెలబోయింది. 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో కాలు బయటపెట్టలేని స్థితి ఉంది. వర్షంతో డ్రైనేజీలు ఉప్పొంగడంతో మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలోని అంతర్గత రహదారులు నీటితో నిండి బురదమయంగా మారినాయి. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. బిసి, ఎస్‌టి కాలనీల్లో వర్షపునీటితో నిండిపోవడంతో వాగులు, చెరువులను తలపిస్తున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ
విఆర్ పురం: ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం. సత్యనారాయణ కోరారు. కొండవాగులు, వంకలు, ఉప్పొంగి ప్రవహించడంతోపాటు చెరువులు, నీటికుంటల్లో నీరు చేరడంతో అటుగా వెళ్లరాదని సూచించారు. వీడకుండా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు, తాగడం, వేడి ఆహారం భుజించడం, అస్వస్థతగా ఉంటే వెంటనే వైద్యసిబ్బందిని సంప్రదించడం చేయాలన్నారు. విద్యుత్ స్తంభాలను, సపోర్టింగ్ వైర్లను తాకరాదని సూచించారు.